telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గట్టెక్కేసిన .. పౌరసత్వ సవరణ బిల్లు ..

nrc bill passed in parliament

బీజేపీ లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ను పాస్ చేసుకుంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్‌ ఒవైసీ చించేశారు. పౌరసత్వ బిల్లుకు ఆమోదం లభించడంతో ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. దాదాపు 10 గంటలపాటు తీవ్ర వాదోపవాదాలు, ఆరోపణల అనంతరం పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. సోమవారం(డిసెంబర్ 9,2019) అర్ధరాత్రి దాటాక జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు పడగా… వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, అన్నాడీఎంకే, అసోం గణపరిషత్‌, శిరోమణి అకాలీదళ్‌తో పాటు ఈ మధ్యే దూరమైన శివసేన కూడా అనుకూలంగా ఓటు వేసింది. అంతకుముందే బిల్లుపై సర్కార్‌ను విమర్శించిన శివసేన… అంతలోనే తన వైఖరి మార్చుకుంది. వైసీపీ, బీజేడీ, టీడీపీ బాసటగా నిలిచాయి. టీఆర్‌ఎస్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది.

బిల్లు ఆమోదంతో పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొనే ముస్లిమేతరులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆమోదించడానికి బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ మూడు దేశాల్లోని హిందువులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి సరైన ట్రావెల్‌ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు లేకపోయినా.. వారు 2014 డిసెంబర్ 31 లేదా అంతకుముందు భారత్‌కు వచ్చి ఉండాలి. బిల్లు భారతీయ ముస్లింలకు ఏమాత్రం వ్యతిరేకం కాదని హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వంలో ముస్లింలు భయపడాల్సిన పనిలేదని… ఇన్నేళ్లూ వారు ఎంత గౌరవంగా జీవించారో ఇక ముందూ అంతే గౌరవంతో స్వేచ్ఛగా జీవించవచ్చని హామీ ఇచ్చారు. బిల్లును ప్రవేశపెట్టాలా.. వద్దా అనే అంశంపై ఓటింగ్‌ నిర్వహించారు. 293 ఓట్లు అనుకూలంగానూ, 82 ఓట్లు వ్యతిరేకంగానూ పడటంతో విపక్ష ప్రయత్నం వీగిపోయింది.

పౌరసత్వ సవరణ బిల్లు పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకమంటూ మండిపడ్డారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఇస్లాం ఇక్కడ వెయ్యేళ్లుగా హిందూయిజంతో కలిసి మెలిసి బతుకుతుందని.. హిందూయిజానికి 4వేల ఏళ్ల చరిత్ర ఉందని.. అలాంటప్పుడు ఎందుకీ వివక్ష అంటూ మండిపడ్డారు. సభలోనే బిల్లు ప్రతులను చింపివేశారు. ఈ బిల్లు చట్టరూపు దాల్చాక ఆరునూరైనా తమ రాష్ట్రంలో అడ్డుకుంటామని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం కోరుతోంది. దీనిపై సీనియర్‌ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

Related posts