నేడు మెల్‌బోర్న్ స్టార్స్-సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హిట్ వికెట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ అయిన స్టీవ్ స్మిత్ ఆడిన బంతిని తప్పించుకునే క్రమంలో వికెట్లను చేతితో పడగొట్టాడు. మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న హరిస్ రాఫ్ వేసిన ఒక బంతి బౌన్స్ కాగా, దాన్ని స్మిత్ తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే ఆ క్రమంలోనే స్మిత్ అదుపు తప్పి వికెట్లపైకి వెళ్లడంతో బెయిల్స్ కిందిపడిపోయాయి. దాంతో అప్పటికి ఇంకా పరుగులు ఖాతా ఆరంభించకపోవడంతో మెల్‌బోర్న్ స్టార్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.
దీనిపై థర్డ్ అంపైర్‌ను సంప్రదించగా అది నాటౌట్‌గా తేల్చాడు. స్మిత్ వికెట్లను తాకడానికి కంటే ముందుగానే బెయిల్స్ పైకి లేచిపోవడంతో నాటౌట్ ఇచ్చాడు. ఆ సమయంలో గాలి కారణంగా బెయిల్స్ లేచాయని భావించిన థర్డ్ అంపైర్ అది హిట్ వికెట్‌గా ఇవ్వలేదు. దాంతో మెల్‌బోర్న్ స్టార్స్ ఆనందం ఆవిరైంది. కానీ స్మిత్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 24 పరుగులు చేసి ఆడమ్ జంపా వేసిన 13వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఆ తర్వాత మెల్‌బోర్న్ స్టార్స్ 99 పరుగులకే ఆలౌట్ కావడంతో పరాజయం పాలైంది. ఫలితంగా సిడ్నీ సిక్సర్స్ ఫైనల్‌కు చేరగా, మెల్‌బోర్న్ స్టార్స్ రెండో క్వాలిఫయర్(చాలెంజర్ మ్యాచ్) ఆడటానికి సిద్ధమైంది.