టోల్ వద్ద రద్దీ వేళల్లో టోల్ ఫీజులు చెల్లించాల్సి వచ్చినప్పుడు, ఎంతగా వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి చాలామందికి అనుభవమే. నిత్యం 1.5 లక్షలకు పైగా వాహనాలు నడుస్తుండే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రూట్ లో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూసేందుకు ఒక లేన్ పై ఏ సమయంలోనైనా 20కి పైగా వాహనాలుంటే టోల్ రుసుము తీసుకోకుండానే లైన్ క్లియర్ చేయాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆదేశాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని అన్నారు. ఇప్పటికే ఓఆర్ఆర్ పై టోల్ వసూలు చేస్తున్న ఈగల్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్ కు ఆదేశాలు పంపించామని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో నానక్ రామ్ గూడ, శంషాబాద్ టోల్ ప్లాజాల ప్రాంతంలో లేన్ల సంఖ్యను పెంచనున్నామని అధికారులు తెలిపారు.