no steel factories in two telugu states by central govt

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాక్..ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయలేమని స్పష్టం!

15
తెలుగు రాష్టాల్లో ఉక్కు కర్మాగారాల  ఏర్పాటు ఆశల పై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆంధ్ర ప్రదేశ్ లోని కడప,  తెలంగాణలోని  బయ్యారం ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  విభజన హామీల అమలుపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదనే రిపోర్టులు వచ్చాయని కేంద్రం తెలిపింది. అయినా మరో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. 
 
ప్రస్తుతం మెకాన్ అనే సంస్థ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యా సాధ్యాలపై పరిశీలన జరుపుతోందని, ఆ సంస్థ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. మెకాన్ సంస్థ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సమాచారం పంచుకుంటోందని, కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు బయ్యారం వ్యవహారం కూడా టాస్క్ ఫోర్స్ పరిధిలో ఉందని అన్నారు. ఇలాంటి సమయంలో విభజన హామీలపై పిటిషన్ విచారణ అర్హం కాదంటూ కేంద్రం  అఫిడవిట్‌లో పేర్కొంది. కొద్ది రోజుల నుంచి కేంద్రం తీరు కడప స్టీల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సాధ్యాసాధ్యాలను  పరిశీలించి, అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే నివేదిక ఇచ్చాం.  ఆ ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కావు. ఇప్పటికే ఉన్న ఉక్కు పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయని వెల్లడించింది.