telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కార్తీక మాసంలో .. ఉసిరి విశిష్టత.. తినితీరాల్సిందే..

usiri importance in kartika masam

కార్తీకమాసంలో మనకు ఎన్నేన్నో ఆరోగ్య సిరులను పంచే “ఉసిరి ” గురించి కొన్ని విషయాలు తెలుసుకొనితీరాలి. మన ఆయుర్వేద శాస్త్రాన్ని పరిశీలిస్తే “ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఒకవేళ ఉసిరి వేర్లు పెరుగుతూ నీటి బావిలోకి పాకితే అందులోని ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఉసిరి విత్తనాలను నీటి బావిలో వేస్తే ఆ నీరు శుద్ధి అవుతాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా ఆరోగ్యకరమైనది. శీతకాలం నుంచి వేసవి వరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాది పొడవునా వాడతారు. కొందరు పంచదార పాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి ఒక అద్భుత ఔషధమే. ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదూ, తీపీ, వగరూ, ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే మరొక ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో కాయే కాదు, వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే.

ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఉప్పులో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ప్రతి ఇంటిలో ఉసిరిని పెంచితే ఆగాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులమాట. భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తున్నాయి.

ఉసిరి కంటి చూపును మెరుగుపరచడంలో చాలా సహాయ పడుతుంది. జ్వరం వచ్చి పచ్చెం పెట్టే సమయం లోనూ, బాలింతకూ పత్తెం పెట్టేప్పుడూ పాత చింతకాయ పచ్చడితో పాటుగా ఉసిరిని కూడా ఎండు మిర్చితో, ఇంగువ వేసి కలిపి పెడతారు. రక్త శుధ్ధికి ఇది మంచి మందుగా పని చేస్తుంది. కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అప్పుడు కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగ్గుతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు. ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సత్కరించడం, పూజాదికాలు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన, బంధుభావన, రోజువారీ పనినుండీ కాస్తంత సేదతీరడం జరిగేవి.

కార్తీకమాసం లో ఉసిరి చెట్ల తోటలలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళినీ రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు.

Related posts