telugu navyamedia
తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణలో ఇక ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవు: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో విద్యాసంస్థలు సెప్టెంబరు 1 నుంచి పునః ప్రారంభమౌతున్న నేపథ్యంలో ఈసారి తరగతి గదుల్లో కనీసం ఆరు అడుగుల వ్యక్తిగత దూరం పాటించాలన్న నిబంధన లేదా? ఈ ప్రశ్నకు విద్యాశాఖ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లోనూ దీనిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. తరగతి గది పరిమాణాన్ని బట్టి భౌతిక దూరం పాటించేలా ప్రధానోపాధ్యాయులు సీటింగ్‌ ప్రణాళిక రూపొందించాలని మాత్రమే పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం ఉదయం కలెక్టర్లు, విద్య, పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ డీఈవో ‘తమ జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో 1200-1400 మంది విద్యార్థులుంటారని, చిన్న గదులుంటాయని, భౌతికదూరం పాటించడం కష్టమవుతుందని’ మంత్రుల దృష్టికి తెచ్చారు. షిఫ్టు విధానంలో నిర్వహణకు అనుమతి కోరారు.

మంత్రి మాట్లాడుతూ.. ‘దూరం ఆరడుగులా, రెండడుగులా అనేది మేం చెప్పలేం. సాధ్యమైనంత దూరం ఉండేలా చూసుకోండి. మాస్కులు ధరించేలా చూడండి’ అని సమాధానమిచ్చినట్టు తెలిసింది. షిఫ్టు విధానం వద్దని స్పష్టంచేసినట్లు సమాచారం. గతంలో తరగతి గదిలో 50% మందే ఉండాలని మార్గదర్శకాలు ఇవ్వగా.. ఈసారి ఆవిషయాన్నీ ప్రస్తావించలేదు. తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉండాలా వద్దా అనేదీ స్పష్టంచేయలేదు. ఈ నిర్ణయాలపై విద్యాశాఖ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు పక్కపక్కన కూర్చుని జాగ్రత్తగా ఉంటారా? అని ఓ విద్యాశాఖ అధికారి అనుమానం వ్యక్తం చేయగా.. విడతల వారీగా తరగతులను ప్రారంభిస్తే బాగుండేదని ఓ డీఈవోఅభిప్రాయపడ్డారు.

‌’ఇక ఆన్‌లైన్‌ తరగతులు ఉండవు. ఆఫ్‌లైన్‌(ప్రత్యక్ష) తరగతులు మాత్రమే ఉంటాయి’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ తరగతులు వద్దని తల్లిదండ్రులే చెబుతున్నారని, అందుకే ఈసారి ప్రత్యక్ష తరగతులనే ప్రారంభిస్తామన్నారు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలకేనా? లేక ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందా? అన్నది స్పష్టం చేయలేదు. ‘గత ఫిబ్రవరిలో ప్రత్యక్ష తరగతులు నడిపినప్పుడు కూడా టీవీ పాఠాలు ఉన్నాయని, ఈసారి కూడా ఉంటాయని’ సమాధానమిచ్చారు. మంగళవారం మంత్రి మాత్రం ఆన్‌లైన్‌ బోధన ఉండదని కుండబద్ధలు కొట్టడం గమనార్హం. మార్గదర్శకాల్లో కూడా ఆఫ్‌లైన్‌ తరగతుల గురించి ప్రస్థావించిన విద్యాశాఖ ఆన్‌లైన్‌ పాఠాలు ఉండవనే విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.

Related posts