తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, కిరోసిన్ డీలర్లు ఇక నుంచి ఏటా తమ లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు రెన్యువల్ నుంచి మినహాయింపు కల్పిస్తూ తెలంగాణ పౌరసరఫరాల శాఖ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డీలర్ షిప్ కోసం ఒకసారి లైసెన్స్ తీసుకున్నవారు ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా వన్ టైమ్ లైసెన్స్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, కిరోసిన్ డీలర్లు తమ లైసెన్సులను జిల్లా పౌరసరఫరాల శాఖ నుంచి ప్రతి ఏడాది లేదా మూడేళ్లొకొసారి రెన్యువల్ చేసుకోవాలన్న నిబంధన అమల్లో ఉండేది.
ఈ విధానం నుంచి తమకు మినహాయింపు ఇచ్చి, వన్‌టైమ్ లైసెన్స్‌కు అవకాశం కల్పించాలని పెట్రోల్ బంక్, కిరోసిన్, ఎల్‌పీజీ డీలర్లు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీలర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. అధ్యయనం చేసి వన్ టైమ్ లెసెన్స్ ఇవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ ఇటీవలే వన్ టైమ్ లైసెన్స్‌కు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం కూడా సమ్మతి తెలిపింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం ప్రాడక్ట్ (లైసెన్సింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ సప్లయిస్ ఆర్డర్ 2016)లో అందుకు అనుగుణంగా సవరణలు చేస్తూ గురువారం నాడు పౌరసరఫరాల శాఖ జీ.వో. నెం. 15ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 2553 పెట్రోల్ బంకులు, 723 ఎల్పీజీ డీలర్లు, 900 వరకు ఉన్న కిరోసిన్ డీలర్లకు ఈ జీవో వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈ జీవో విడుదల పట్ల పెట్రోల్ బంక్, ఎల్‌పీజీ, కిరోసిన్ డీలర్ల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది.