కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ విషయంలో మలేషియా, టర్కీ దేశాలు భారతదేశాన్ని విమర్శించిన నేపథ్యంలో ఆయా దేశాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల నుంచి పామాయిల్ తోపాటు ఇతర సరకుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆ రెండు దేశాల దిగుమతులను నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. మలేషియా ప్రధాని మహతీర్ మొహమాద్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో కశ్మీర్ విషయంలో భారత తీరును వ్యతిరేకించారు. దీంతో మలేషియా దేశానికి బలమైన సంకేతాన్ని పంపేందుకే ఆ దేశ దిగుమతులపై ఆంక్షలు విధించారు.
భారతదేశానికి మూడువంతుల పామాయిల్ మలేషియా నుంచి దిగుమతి అవుతుండేది. భారతదేశం ఏటా మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి 9 మిలియన్ టన్నుల పామాయిల్ దిగుమతి చేసుకుంటుండేది. మలేషియా ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతులను నిలిపివేసి, ప్రత్యామ్నాయంగా ఇండోనేషియా, అర్జెంటీనా, ఉక్రెయిన్ దేశాల నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇది ప్రపంచానికి జమ్మూకశ్మీర్ పై భారత వైఖరిని సుస్పష్టం చేసింది.