telugu navyamedia
రాజకీయ వార్తలు

యాంటీ చైనా సెంటిమెంట్ ను భారత్ అందిపుచ్చుకోవాలి: గడ్కరీ

లాక్ డౌన్ కారణంగా దిగజారిన వృద్ధి రేటును భారత్ అతి త్వరలోనే తిరిగి పుంజుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. చైనాకు ప్రపంచమంతా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇది భారత్ కు ఓ వరం వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ కంపెనీలతో మరిన్ని జాయింట్ వెంచర్లను ప్రారంభించి, ముందుకు సాగాల్సిన సరైన సమయం ఆసన్నమైందన్నారు.

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మానవ తప్పిదం ద్వారానే బయటకు వచ్చిందన్న వార్తల నేపథ్యంలో, ఆ దేశంతో వ్యాపార సంబంధాలను పెంచుకోవాలన్న ఆలోచనను పలు దేశాలు విరమించుకున్నాయి. గతంలో జపాన్ ప్రకటించిన 2 బిలియన్ డాలర్ల ఫండ్ ను నెగటివ్ సెంటిమెంట్స్ కారణంగా వెనక్కు తీసుకుంది. ఈ తరహా యాంటీ చైనా సెంటిమెంట్ ను భారత్ అందిపుచ్చుకోవాలన్నారు.

జపాన్ తో ద్వైపాక్షికంగా సత్సంబంధాలున్న ఇండియా, అక్కడి నుంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి. విదేశీ పెట్టుబడులకు ఇండియా ఓ మంచి స్వర్గధామం అవుతుంది. ఇక్కడి నైపుణ్యవంతులైన కార్మికులు, తక్కువ ధరకు లభించే భూమి విదేశీ కంపెనీలను ఆకర్షిస్తాయని నితిన్ గడ్కరీ అన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రహదారుల విస్తరణ లక్ష్యాన్ని రెట్టింపు చేస్తామని అన్నారు. కాంట్రాక్టర్ల వద్ద నగదు కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం తాను చేయగలిగినదంతా చేస్తుందని అన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో పాల్గొనే కార్మికుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించేలా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టరుదేనని తెలిపారు.

Related posts