telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా లైఫ్‌లో ఆయనుండటం నా అదృష్టంగా భావిస్తాను : నితిన్

Bheeshma

నితిన్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

తన గత చిత్రానికి ఈ సినిమాకు మధ్య గ్యాప్ ఇంచుమించుగా ఏడాదిన్నర ఉందని.. ఈ గ్యాప్ తీసుకోవడానికి కారణం స్క్రిప్ట్ పక్కాగా ఉండాలని కోరుకోవడమేనని నితిన్ చెప్పారు. ‘‘వెంకీ ఫుల్ స్క్రిప్ట్ చెప్పేవరకు నేను ఆగి సినిమా స్టార్ట్ చేశాం. మొత్తానికి సినిమా పూర్తయి ఫిబ్రవరి 21కి వస్తుంది. వెంకీ దిల్ సినిమాకు పెద్ద ఫ్యాన్ అంట, నాకు పెద్ద ఫ్యాన్ అంట.. కాబట్టి, ఒక ఫ్యాన్ బోయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పాడు నాకు. చెప్పినట్టుగానే సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి తీశాడు. నాకు మళ్లీ దిల్, సై తరవాత మళ్లీ అలాంటి యాంగిల్‌లో నన్ను చూపించాడు. అన్న డ్యాన్స్ కావాలి అని ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఈ సినిమాలో మీకోసం డ్యాన్స్ చేశాను. దీంతో మీ ఆకలి తీరుతుందని నా ఫీలింగ్. ఆ డ్యాన్స్ కోసం మా జానీ మాస్టర్ బెండ్ తీశాడు. ద్రోణ సినిమాకు మేమిద్దరం పనిచేసినప్పుడు నా వయసు 26 ఏళ్లు. అప్పుడు బాడీలో మూమెంట్ బాగుంది, అన్నీ షేక్ అవుతున్నాయి. మధ్యలో కొన్ని సాఫ్ట్ సినిమాలు చేసి బాడీ కొంచెం బిగుసుకుపోయింది. మళ్లీ జానీ మాస్టర్ సాంగ్ అనగానే నా బెండు తీస్తాడు అనుకున్నా. అనుకున్నట్టుగానే పులుసు కారిపోయింది నాకు. ఇప్పుడు 35 ఏళ్లు వచ్చాయి. కానీ, స్క్రీన్ మీద డ్యాన్స్ చూస్తున్నప్పుడు మీరు విజిల్స్ వేస్తూనే ఉంటారు. నా అందానికి టిప్స్ బ్రహ్మాజీ గారు ఇస్తే.. రష్మిక ఇంత అందంగా, ఫిట్‌గా ఉండటానికి కారణం ఆమె తినే ఆహారం. ఏం తింటుందో నాకు తెలీదు. కానీ, ఆ ఫుడ్‌లో ఒక స్పెషాలిటీ ఉంది. మీరు మాత్రం ట్రై చేయకండి. దానిపై అన్ని కాపీరైట్స్ తనకే ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక చాలా బాగా చేసింది. నటన ఆమెకు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో నన్ను షాక్‌కు గురిచేసింది మాత్రం ఆమె డ్యాన్స్. వాట్ ఏ బ్యూటీ సాంగ్‌లో డ్యాన్స్ చాలా బాగా చేసింది. రష్మిక.. నువ్వు నా ఫ్రెండ్. నేను నిన్ను భరిస్తా, నువ్వు నన్ను భరించు, మనిద్దరినీ నా కాబోయే భార్య భరించాలి. ఇక నా లైఫ్‌లో పంచ ప్రాణాలు.. అమ్మ, నాన్న, అక్క, పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు. ఇప్పుడు నాకు పెళ్లికాబోతోంది కాబట్టి తను నాకు ఆరో ప్రాణం. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఈ ఆరుగురే. త్రివిక్రమ్ గారితో పరిచయం, ఆయనతో ‘అ ఆ’ సినిమా చేయడం, నా లైఫ్‌లో ఆయనుండటం నా అదృష్టంగా భావిస్తాను. ఆయన గురించి ల్యాగ్ లేకుండా షార్ట్‌గా చెప్పాలంటే.. ఆయన నా ముందుంటే నా దారి, నా పక్కనుంటే నా అండ, నా వెనకుంటే నా ధైర్యం, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నాకొక టార్చ్ బేరర్’’ అని నితిన్ చెప్పారు.

Related posts