telugu navyamedia
తెలంగాణ వార్తలు

వేట‌కారం కాదు ..నేనేం మాట్లాడానో జాగ్రత్తగా విని స్పందించాలి..

ప్రతి పథకంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెరొక వాటా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని ఒక్కరి పేరే ఎలా పెట్టుకుంటారని ఆమె ప్రశ్నించారు.

శనివారం హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిధులు పక్కదారి పట్టకుండా డిజిటలైజేషన్ తెచ్చామన్నారు.జిల్లాల పర్యటనలో చాలా విషయాలు తెలుసుకున్నానని ఆర్ధిక మంత్రి వ్యాఖ్యానించారు. 60 శాతం నిధులు కేంద్రం ఇస్తే.. 40 శాతం రాష్ట్రాలు భరించాలని నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రం వాటా ఉన్నప్పుడు పేరు పెట్టడానికి అభ్యంతరం ఏంటని ఆమె ప్రశ్నించారు.

కేంద్రం వాటా ఇస్తున్న వాటిలో తమ ఫొటో ఉండాల్సిందేనని ఖరాఖండిగా చెప్పారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

రాజీనామా సవాళ్లను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయుష్మాన్ భారత్‌లో 2021 వరకు తెలంగాణ ఎందుకు చేరలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిలదీశారు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలంటూ హరీశ్‌రావుకు నిర్మలా సీతారామన్ చురకలు వేశారు.

కేటీఆర్‌ ట్వీట్‌పై కూడా నిర్మలా సీతారామన్‌ విరుచుకుపడ్డారు. పన్నుల రూపంలో తామే అధికంగా కేంద్రానికి ఇస్తున్నామనడంపై మండిపడ్డారు. కేంద్రం.. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సరైన డీపీఆర్‌ లేదని, రూ.1.40లక్షల కోట్లు ఖర్చుపెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇంకా డీపీఆర్‌ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలకు వివరించేందుకే క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నామని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

ఫైనాన్స్ కమీషన్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తూనే వున్నామని.. ఈ రాష్ట్రానికి ఎక్కువ, ఆ రాష్ట్రానికి తక్కువ ఇవ్వడం అనేది ఎవరి చేతుల్లోనూ వుండదని ఆమె స్పష్టం చేశారు. సెస్‌ల పేరుతో వసూలు చేసే నిధులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయని.. ఏ కారణంతో సెస్ వసూలు చేశారో, వాటి కోసమే ఆ నిధులు ఖర్చు చేయాలని నిర్మలా సీతారామన్ సూచించారు.

Related posts