telugu navyamedia
వార్తలు

బిచ్చగాడి కృత్రిమ కాలులో 96 వేలు…!!

Beggar

15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు వెళ్ళి అక్కడే కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ లో స్థిరపడ్డారు షరీఫ్‌ సాబ్‌. ఆయన వయసు 75 సంవత్సరాలు. కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై చిన్న గుడిసె వేసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. అక్కడే భిక్షాటననే జీవనాధారంగా మార్చుకున్నాడు. 12 ఏళ్ల క్రితం గాంగ్రిన్‌ అనే వ్యాధి కారణంగా షరీఫ్‌ కుడికాలు తొలగించి ఆ స్థానంలో కృత్రిమ కాలును ఏర్పాటు చేశారు. అయితే ఈ వృద్ధుడు బిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బులో ఖర్చులు పోగా… మిగిలిన డబ్బును తన కృత్రిమ కాలులోనే దాచుకునేవాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని పబ్లిక్‌ టాయ్‌లెట్‌కు వెళ్లిన షరీఫ్ సాబ్… ఉన్నట్టుండి అక్కడే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు చనిపోయినట్లు గుర్తించి హై గ్రౌండ్‌ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. అయితే షరీఫ్ సాబ్ మృతదేహాన్ని తరలించే సమయంలో అతని కృత్రిమ కాలు బరువుగా అనిపించిందట. వెంటనే తీసి చూడగా అందులో రూ.96,780 డబ్బు లభించింది. డబ్బుతో పాటు మృతదేహాన్ని అప్పగించేందుకు షరీఫ్‌ కుటుంబీకుల వివరాలు ఆరా తీస్తున్నట్లు హౌ గ్రౌండ్‌ పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గాడేగ్‌ గురువారం మీడియాకు తెలిపారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గాడేగ్‌ మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు, మృతదేహాన్ని బౌరే ఆసుపత్రిలో భద్రపరిచినట్టు తెలిపారు. మరో వారం రోజులపాటు షరీఫ్ కుటుంబీకుల కోసం ఎదురు చూస్తామని, ఆ తరువాత మున్సిపాలిటీ అధికారుల సాయంతో ఖననం చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే స్థానిక మైనార్టీ పెద్దలు కొందరు షరీఫ్ కుటుంబీకుల ఆచూకీ తెలియకపోతే, ఆయన మృతదేహాన్ని తమకు అప్పగించాలని, వారు తమ పద్ధతుల ప్రకారం ఖననం పూర్తి చేస్తామని కోరారని తెలిపారు.

Related posts