ప్రపంచ కప్ పోరాటంలో ఆల్‌రౌండర్లతో కళకళలాడుతున్న న్యూజిలాండ్ జట్టు అదరగొడుతున్నది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన కివీస్..ఆఫ్ఘనిస్థాన్ పని పట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ అందుకుంది. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆఫ్ఘన్ ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ మార్టిన్ గప్టిల్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొలిన్ మున్రో(22), కెప్టెన్ విలియమ్సన్(32 నాటౌట్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆఫ్ఘన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. ఆలమ్(3/45) బౌలింగ్‌లో మున్రో ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్(99 బంతుల్లో 79 నాటౌట్, 9ఫోర్లు), టేలర్(48) జట్టు విజయంలో కీలకమయ్యారు. టేలర్ ఔటైనా..ఒత్తిడికి లోనుకాని విలియమ్సన్..లాథమ్(13 నాటౌట్)తో కలిసి జుట్టకు అలవోక విజయాన్నందించాడు. ఐదు వికెట్లు తీసిన నీషమ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. తొలుత టాస్ గెలిచిన కివీస్..లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపుతూ ఆఫ్ఘన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జేమ్స్ నీశమ్(5/31), ఫెర్గుసన్(4/37) ధాటికి ఆఫ్ఘన్ 41.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. జట్టులో హష్మతుల్లా షాహిది(59), హజ్రతుల్లా జజాయ్(34), నూర్‌అలీ జద్రాన్(31) ఫర్వాలేదనిపించారు.