ఓ యువతికి వివాహమై వారం రోజులు కాకముందే అత్తింటిలో కట్నం వేధింపులు ఎదురయ్యాయి. అదనపు కట్నం తీసుకునే కాపురానికి రావాలని భర్త పుట్టింట్లో వదిలేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన యువతి ప్రాణాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈరోజు ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరికి చెందిన ధరిగేశ్వరికి అదే జిల్లాకు చెందిన మహేశ్ తో ఈ నెల 17న వివాహమయింది. పెళ్లి సమయంలో తగిన కట్నకానుకలు సమర్పించుకున్నారు.
పెళ్లయిన తర్వాత అదనపు కట్నం కోసం మహేశ్ ధరిగేశ్వరిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో నిన్న ఆమెను పుట్టింటికి తీసుకొచ్చి వదిలేశాడు. అదనపు కట్నం తీసుకునే కాపురానికి రావాలని స్పష్టం చేశాడు. తల్లిదండ్రులు ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టి వివాహం చేశారనీ, ఇప్పుడు మళ్లీ అదనపు కట్నం ఎక్కడ తీసుకొస్తారని ధరిగేశ్వరి మనస్తాపానికి లోనైంది. ఈరోజు ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.