తాజాగా కరోనా అనే కొత్త వైరస్ చైనాని వణికిస్తోంది. ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 41 మంది నిమోనియా బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి కూడా ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ నగరాన్ని సందర్శించిన ఓ 30 ఏళ్ల జపాన్ యువకుడికి కూడా ఈ వైరస్ సోకింది. కొన్నేళ్ల క్రితం స్వైన్ ఫ్లూన్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికించింది. తర్వాత జికా వైరస్ ఇబ్బంది పెట్టింది. తాజాగా, కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. దీంతో ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
వారం క్రితం థాయ్‌లాండ్‌లో ఓ యువతి ఈ వైరస్ బారిన పడడం, ఇప్పుడు జపాన్ యువకుడికి కూడా అదే వైరస్ సోకినట్లు తెలియడంతో ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వైరస్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని ముందుగా అనుమానించారు. కానీ, ఆ తర్వాత మనుషుల నుంచే మనషులకు వస్తుందని తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేశారు. ఇటీవల చైనాను సందర్శించి వచ్చిన 15 మంది హాంకాంగ్ యువకులకు ఈ వైరస్ సోకిందో, లేదో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
దర్శకనిర్మాతలు రూమ్ లో పెట్టి తాళం వేసేవారు… హాట్ బ్యూటీ కామెంట్స్