కరోనా ఖతమైందనుకునే తరుణంలో కొత్త వేరియంట్ భయపెడుతోంది. ప్రజలు నిర్లక్ష్యంచేస్తే కొత్తవేరియంట్ ఏక్షణాన్నైనా… కోరలుచాచే అవకాశం ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వ్యాధినిరోధక శక్తి పెంపొందించుకోవడం… తొలిడోసు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లందరూ… రెండో డోసు వేసుకోవాలని ఆయన కోరారు. ఎవరి జాగ్రత్తలో వారుండాలని, నిర్లక్ష్యంచేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు.
కొత్తవేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కోడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికతో సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలను జారీ చేసిందని పేర్కొన్నారు. మాస్క్ లేకుండా తిరిగే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించేవిధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టిందన్నారు. ఒమిక్రాన్ 20 దేశాలలో విస్తరించింది.
కరోనా, ఒమిక్రాన్ విస్తరించిన దేశాలనుంచి హైదరాబాద్ వచ్చిన 325 మందిని పరీక్షిస్తే… 35 యేళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ నిర్థరణ కావడంతో క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. ఓవైపు చికిత్స అందిస్తూనే… మరోవైపు ఆమెనుంచి సేకరించిన నమునాలు జీనోమ్ సిక్వెన్స్కి పంపించామని శ్రీనివాసరావు తెలిపారు. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని… ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడికి వెళ్లినా… మాస్క్ తప్పని సరిగా వినియోగించేందుకు చొరవతీసుకోవాలని ప్రజలను కోరారు.