telugu navyamedia
తెలంగాణ వార్తలు

వనమా రాఘవ త‌మ‌కు దొరకలేదంటున్న పోలీసులు..

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన‌ టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను తాము అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.

వనమా రాఘవ తమకు దొరకలేదని, అతని కోసం ఏడెనిమిది బృందాలు తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నట్లు వెల్లడించారు. వనమా దొరికితే రౌడీషీట్‌ నమోదు చేసి కస్టడీలోకి తీసుకుంటామన్నారు. రాఘవపై గతంలో నమోదైన కేసులు ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు ఆధారాలు లభిస్తే రౌడీషీట్ నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

కాగా.. ఈ నెల 3న పాల్వంచలో మండిగ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు అసలు కారణం వనమా రాఘవ అని తేలింది. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

తన ఆత్మహత్యతో పాటు భార్యా బిడ్డల్ని సైతం చంపుకునేందుకు రాఘవేంద్రరావు బెదిరింపులే కారణమని బాధితుడు ఆ వీడియోలో ఆరోపించటంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలంటూ భాజపా, కాంగ్రెస్‌ ఆందోళనకు దిగాయి. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గురువారం సాయంత్రం వనమా రాఘవేంద్రరావును  హైదరాబాద్‌ సరిహద్దుల్లో  అదుపులోకి తీసుకుని కొత్తగూడెం తరలించినట్లు మీడియ‌లో వార్త‌లు వ‌చ్చాయి. తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన కుమారుడుపై పాల్వంచ రామకృష్ణ ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు లేఖరాశారు. 

రాఘవను పోలీసుల విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలా ఎమ్మెల్యే స్పందించిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్ లో రాఘవను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేద‌ని పోలీసులు చెబుతున్నారు.

Related posts