telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ : నిర్మాణ రంగంలో అక్రమాలకు ఇక చెక్ .. కొత్త పద్దతులతో పరిశీలన ..

new policies to find frauds in consturction area

పశ్చిమ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో పురపాలకశాఖ నిర్మాణాల్లో అక్రమాలను వెలికితీసేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ బాధ్యతను ఎయిర్ సర్వ్ సంస్థకు అప్పగించింది. పూర్తిస్థాయి ఆధునిక పరిజ్ఞానంతో రంగంలోకి దిగిన ఆ సంస్థ.. 2014- 2018 మధ్య స్థానిక సంస్థ నుంచి అనుమతి తీసుకున్న వెయ్యి చదరపు మీటర్లకంటే అధిక విస్తీర్ణంగల 211 నిర్మాణాల్ని ఎంచుకోగా, వాటిలో అరవై సముదాయాల్లో సర్వే నిర్వహించింది. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఈ సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

* సుమారు 15% నిర్మాణాలకు చెందిన యజమానులు సర్వే నిర్వహించడానికి అనుమతించలేదు.
* అనుమతి తీసుకున్న పది శాతం నిర్మాణాలు ప్రారంభమేకాలేదు.
* అరవై నిర్మాణాల్లో ఎలాంటి సమస్యల్లేకపోగా.. మిగతా వాటిలో రకరకాల సమస్యలు ఉన్నట్టు ఎయిర్‌సర్వ్ సంస్థ గుర్తించింది.
* ఎనభై శాతం కొత్త నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఎయిర్ సర్వే నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులో తేలింది. స్థానిక సంస్థల అధికారులు, బిల్డర్లు కుమ్మక్కై.. ఏస్థాయిలో అవినీతి చేస్తున్నారో వెలుగులోకి వచ్చింది.
* నివాస సముదాయాలుగా అనుమతి తీసుకున్న కట్టడాల్లో పదిశాతాన్ని వాణిజ్య అవసరాలకోసం వినియోగిస్తున్నారని తేలింది.
* ప్రతి నిర్మాణం ద్వారా స్థానికసంస్థకు లక్షల్లో నష్టం వాటిల్లిందని, ఇదే కొనసాగితే ఆదాయం గణనీయంగా తగ్గుతుందని సర్వేలో వెల్లడైంది. 

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో అక్రమార్కులపై కొరడా ఝుళిపించనుంది .. తాజాగా మున్సిపల్‌లో అక్రమాలపై దృష్టిసారించింది. అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణానికి కొందరు బిల్డర్లు అనుమతులు తీసుకున్నా.. అందుకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆయా స్థానిక టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ అధికారులతో బిల్డర్లు కుమ్మక్కై అక్రమ అంతస్తులను యథేచ్ఛగా కడుతున్నారనే ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని అప్పటి పురపాలకశాఖ మంత్రి, ప్రస్తుత టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సీరియస్‌గా పరిగణించారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే టీబర్డ్స్ (తెలంగాణ బిల్డింగ్ ఇన్‌స్పెక్షన్ అండ్ రిపోర్టింగ్ యూజింగ్ డ్రోన్స్) అనే విధానానికి శ్రీకారం చుట్టారు.

డ్రోన్ల సాయంతో నిర్మాణాల చిత్రాలను సేకరించి.. సదరు కట్టడాల సమాచారాన్ని స్థానికసంస్థల నుంచి తీసుకుని అధ్యయనంచేస్తారు. బిగ్‌డాటా అనలిటిక్స్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో జోడించి.. వాస్తవ డిజైన్, పూర్తయిన నిర్మాణం మధ్య వ్యత్యాసాన్ని గుర్తిస్తారు. అనుమతికి విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి.. సంబంధిత విభాగాలకు సమాచారం ఇస్తారు. ఆయా కట్టడాల నుంచి ప్రభుత్వ విభాగాలకు రావాల్సిన వాస్తవిక ఆదాయాన్ని రాబడుతారు. ఈ విధానం మొత్తం ఆధునిక పరిజ్ఞానం సాయంతో భద్రపరుస్తారు. దీనితో భవిష్యత్తులో ఆయా నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా, ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుంది.

Related posts