రెవెన్యూ శాఖ కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో భాగంగా జిల్లాల నుంచి వివరాలు కోరుతోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని వైకాపా ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా జిల్లా, రెవెన్యూ మండలాల వారీగా ఉన్న జనాభా, ఇతర సమాచారాన్ని వెంటనే పంపాలని కలెక్టర్లను కోరుతున్నామని బుధవారం రెవెన్యూ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే పక్షంలో ప్రస్తుతం ఉన్న జిల్లాల స్వరూపాన్ని మార్చాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో ఐదింటికి, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన 12 జిల్లాల్లో మరో అయిదింటికి ఎటువంటి ఆటంకాలు లేవు. మిగిలిన వాటి విషయంలో కొన్ని సమస్యలను గుర్తించారు.
అయితే ప్రాథమిక దశలోనే వీటి ఏర్పాటుకు కొన్ని సమయాలు ఎదురవుతున్నాయి.. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలో సంతనూతలపాడు ఉంది. సంతనూతలపాడు మండలానికి చెందిన పేర్నమిట్ట ఒంగోలు నగరంలో అంతర్భాగంగా ఉంది. జిల్లా కేంద్రంగా బాపట్లను గుర్తిస్తే ఒంగోలు నగర పరిధిలో ఉన్న సంతనూతలపాడు మండల వాసులు అక్కడి వరకు వెళ్లాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే పల్నాడు ప్రాంతానికి అనువుగా ఉంటుంది. పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అమరావతి మండలవాసులకు దూరం అవుతుంది. కర్నూలు జిల్లా పాణ్యం శాసనసభ నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీలు కర్నూలు నగర పరిధిలో ఉన్నాయి. నంద్యాల పార్లమెంటు పరిధిలో పాణ్యం ఉంది. ఇలా…దూరాభారాలను పరిశీలించాలి.
అనంతపురం రూరల్ మండలం రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఉంది. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రాప్తాడు ఉంది. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా గుర్తిస్తే అనంతపురం గ్రామీణ మండల వాసులు అంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. గిరిజనులు అత్యధికంగా ఉన్న అరకును జిల్లాగా గుర్తించడంలో పలు అంశాలను పరిశీలనకు వస్తున్నాయి. ఈ నియోజకవర్గం వివిధ జిల్లాల పరిధిలోకి వస్తోంది. దీన్ని ఒక జిల్లాగా గుర్తిస్తే పరిపాలనాపరంగా సమస్యలు వస్తాయి. దీని వల్ల అరకును 2 జిల్లాలుగా చేయాల్సి ఉంటుంది… ఇలా వివిధ కోణాల నుంచి రెవెన్యూ శాఖ వివరాలను జిల్లా అధికారుల నుంచి కోరుతూ లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా గుర్తించడంలో ఉన్న సమస్యలు…తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు జరుగుతోంది. సీఎం స్థాయిలో సమీక్షా సమావేశం జరిగితే కొత్త జిల్లాల ఏర్పాటు పరిస్థితిని వివరించేందుకు రెవెన్యూ శాఖ సమాయత్తం అవుతోంది.
అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకోని కొత్త జిల్లాలను ప్రకటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అన్ని శాఖలు ఏర్పడాలి. కొత్తగా నియామకాలు చేపట్టాలి. ఆర్థికపరమైన అంశాలను పరిశీలించాలి. పోలీసు శాఖపరంగా దృష్టి పెట్టాలి. ఇందులోభాగంగా ఉన్నత స్థాయిలో పలు కమిటీలు ఏర్పడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కసరత్తు పూర్తి స్థాయిలో జరిగేందుకు తగిన సమయం కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
కంగన అండగా నిలిచిన సందర్భం ఒక్కటీ లేదు… : తాప్సి