telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సరిగ్గా చేయకపోతే చీరేస్తా…

చెప్పినట్లు వినాలి… అలా వినకపోతే అంతుచూస్తాం… తేడా వస్తే చీరేస్తాం… అని ప్రభుత్వ అధికారులను భయపెడుతున్నారు. గ్రామాల్లో సమస్యలను ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కారంకోసం అధికారుల సహకారం తీసుకోవడం ఆనవాయితీ… తూర్పుగోదావరిజిల్లా అయినవిల్లిలో ప్రభుత్వ అధికారులనే భయభ్రాంతులకు గురిచేసిన ఘటన చోటుచేసుకుంది. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ చాంబర్ లోనే ఒక దళిత ఎంపిడిఒ పై ఏకవచనంతో నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్, వైసిపి నాయకుడు వాసంశెట్టి తాతాజీ రెచ్చిపోయాడు.

కె.జగన్నాధపురం గ్రామంలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు, స్థానిక జడ్పిటిసి ప్రొటోకాల్‌ విషయంలో గత కొన్ని రోజులుగా ఎంపిడిఒ అధికారిని టార్గెట్ చేసిన వైసిపిలోని కొందరు నాయకులు, ఆమెను ఇబ్బందిపెట్టే ప్రయత్నంచేశారు. ఒత్తిడిని తట్టుకోలేని ఎంపీడీవో పనులపై దృష్టిసారించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. పనితీరు నచ్చకపోతే బదిలీ చేయించమని సమాధానమివ్వడంతో… వైసిపి నాయకుడు వాసంశెట్టి తాతాజీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయి సరిగ్గా చేయకపోతే చీరేస్తానని బెదిరించాడు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తనను టార్గెట్ చేస్తూ, తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపిడిఒ ఆవేదన వ్యక్తంచేశారు. మండలంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లు తెస్తున్నా… సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం నాయకులకు మింగుడు పడటంలేదని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఎంపిడిఒ పై ఆ నేతలు కక్ష్య గట్టి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. బెదిరింపులకు తెగబడుతున్నారు. విధినిర్వహణలో తను ఎదుర్కొంటున్న ఇబ్బందులను జిల్లా ఉన్నతాధికారులు గుర్తించాలని వేడుకుంటోంది.

Related posts