కార్మికులు, ఉద్యోగులతో పాటు రైతులు కూడా ఏకమై కదం తొక్కనున్నారు. 16 డిమాండ్లతో తొమ్మిది జాతీయ కార్మిక సంఘాలతోపాటు కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏకమై సమ్మెకు దిగనున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు, సభలకు కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య, జీవిత భద్రత కల్పించాలని, పనిగంటల పెంపును ఆపి, కనీస వేతనం పెంచాలని కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న చట్టాలు కొద్దిమంది కార్పొరేట్లకు సంపదను దోచిపెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయని కార్మికలోకం మండిపడుతోంది. కార్మికుల జీవితాలకు భద్రతను, ఉద్యోగాలకు భరోసాను అందిస్తున్న 44 లేబర్ చట్టాలను కేంద్రం మార్చేసింది. కొత్తరూపంలో మళ్లీ అమల్లోకి తెచ్చింది. 2002లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిన నల్లచట్టాలను మోదీ ప్రభుత్వం ఇటీవలే నాలుగు కోడ్ల రూపంలో తెచ్చింది. వేతనాలు, భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు, సామాజిక భద్రత పేరుతో దారుణ చట్టాలను కార్మికులపై రుద్దుతోందని అంతా మండిపడుతున్నారు. ఈ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చిన వెంటనే కార్మికులకు సంఘాలు పెట్టుకొని, సమ్మెచేసే హక్కులు చేజారిపోతాయి. అనేక పోరాటాల ఫలితంగా 8 గంటల పని విధానం అమల్లోకి రాగా.. ఇప్పుడు మోదీ సర్కారు, యాజమాని కోరుకుంటే 12 గంటల పాటు పనిచేయాలనే విధంగా మార్చేస్తోంది. ప్రజలు కష్టపడి సాధించుకున్న చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
previous post