రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి జాతీయ జలమిషన్ పురస్కారం. రాష్ట్రానికి పలు అవార్డులు దక్కాయి. 10 విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. తెలంగాణ సాగునీటి సమాచార వ్యవస్థ, రాష్ట్ర భూగర్భజల వనరులశాఖ, మిషన్ భగీరథ పథకం పురస్కారాలకు ఎంపికయ్యాయి. తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ (టీడబ్ల్యూఆర్‌ఐఎస్) కేటగిరీ 1-A లో ఎంపికైంది. అలాగే భూగర్భజలాల నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్న తెలంగాణ భూగర్భజల వనరులశాఖను కేటగిరీ-3 కింద ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ 4సీ క్యాటగిరీ కింద అవార్డుకు ఎంపికైంది. కేంద్ర జలసంఘం, కేంద్ర భూగర్భ జల బోర్డు స్టడీ చేసి ఈ పురస్కారాలను ప్రకటించారు.
సెప్టెంబర్ 25వ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. జాతీయ స్థాయిలో మిషన్ భగీరథకు అవార్డు రావడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషికి గుర్తింపు లభించినట్టు అయ్యిందన్నారు. తెలంగాణలో మహిళలు తాగునీటి కోసం పడే కష్టాలను తొలగించడంతో పాటు ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.
మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని చేపట్టిందన్నారు. దేశంలోని ప్రతి ఇంటికీ తాగు నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ బృహత్తరమైన మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏజెన్సీ ప్రజలు కలుషిత నీటిపై ఆధారాపడాల్సిన అవసరం లేకుండా రూపకల్పన చేశారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. గోదావరి జలాలను ఇంటింటికీ నల్లాల ద్వారా అందించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టారు.