telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ రాజకీయ వేదిక కాదు: నరేశ్‌

‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న మంచు విష్ణు, అతని ప్యానల్‌తో కలిసి నరేశ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. ‘‘మా’లో నేను 20 ఏళ్లు కేవలం సాధారణ సభ్యుడిగానే ఉన్నా. జయసుధ పోటీ చేస్తున్నప్పుడు నన్ను వైస్‌ ప్రెసిడెంట్‌గా చేయమని దివంగత దాసరి నారాయణరావు అడిగితే సరేనన్నాను. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ‘జాయింట్‌ సెక్రటరీగా చేస్తావా’ అన్నారు. ఇక్కడ ‘స్థాయి అంటూ ఏం ఉండదండి. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా అయినా పోటీ చేసేందుకు సిద్ధం’ అని నేను అన్నాను. ‘మా’లో ప్రతి సభ్యుడూ సమానం అనే ఆలోచనతో వచ్చాం. మేం 22 మంది గెలిచాం. కానీ, జయసుధ ఓడిపోయింది. నేను జాయింట్‌ సెక్రటరీగా గెలిచాను. వెల్ఫేర్‌ కమిటీ ఛైర్మన్‌ అయ్యాను. నటులకు సినీ అవకాశాలు, కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేశాను. ఇవన్నీ చరిత్రలో ఓ భాగం. మసకబారుతున్న ‘మా’ను వెలుగులోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నం అది’’ అని చెప్పారు.

Here Is The Manchu Vishnu's Panel for MAA Elections - Manchu Vishnu
‘‘మా’ రాజకీయ వేదిక కాదు. పదవీ వ్యామోహాలు ఉండకూడదు. కొవిడ్‌ సమయంలో ‘మా’లో రెండు గ్రూపులు మొదలయ్యాయి. వాటిల్లో ఓ బృందం మీడియా వద్దకి వెళ్లి నిందించే ప్రయత్నం చేసింది. కరోనా సమయంలో భవనం కంటే మనుషుల ప్రాణాలకు ప్రాధాన్యతిచ్చాం. మేం చేయాల్సిన మంచి పనులు ఇంకా ఉన్నాయి. ‘మా’ అధ్యక్షుడిగా సంక్షేమ పథకాలు తీసుకొస్తా అని చెప్పా. ‘మా’ భవనం కోసం ప్రయత్నం చేశా. దానికి సంబంధించిన ఆధారాలున్నాయి. నా తర్వాత ‘మా’కి మంచి అధ్యక్షుడిని అందించడం నా బాధ్యత. పదవి చేపట్టినప్పుడే ఈ విషయం చెప్పాను. ఈ కుర్చీలోకి ఎవరు పడితే వారు వస్తే ‘మా’ వైభవం కోల్పోతుంది. ప్రకాశ్‌ రాజ్‌ నాకు మంచి స్నేహితుడు. మంచు విష్ణు ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటారు. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడు. నాది కృష్ణుని పాత్ర. ‘మా’ కోసం మంచు విష్ణు రథం ఎక్కుతున్నాను. విష్ణుకి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా’’ అని నరేశ్‌ చెప్పారు.

‘‘ప్రకాశ్ రాజు ఆరు నెలల క్రితం ఓ ప్యానల్‌ని నిలబెట్టారు. తొందరపడొద్దని చెప్పా. ఆ తర్వాత నాతో ఫోన్‌లో మాట్లాడుతూ నేను పోటీ చేస్తున్నా అని అన్నారు… చేయండి అని స్వాగతించాను. ఎవరైనా ‘మా’ సభ్యులు చనిపోయినపుడు వెళ్లడం, ఎంతో కొంత ఇవ్వడం, ఫొటోలు దిగడం లాంటివి చేస్తుంటారు కొందరు. సేవా రాజకీయం, శవ రాజకీయం.. అని రెండు రకాలున్నాయి. నాకు మొదటిదే తెలుసు. కొంతమంది దగ్గర శవ రాజకీయం చూశా. పదవితో సంబంధం లేకుండా శివ బాలాజీ, రాజీవ్‌ కనకాల, లక్ష్మీకాంతరావు మంచి పనులు చేశారు. మెసేజ్‌లు పంపించడమే జనరల్‌ సెక్రటరీ బాధ్యతైతే.. ఆ పదవిలోకి నేను మళ్లీ వస్తా. ‘మా’ తరఫున మేం 16 కుటుంబాలకి 24 గంటల్లో జీవితా బీమా చెక్కులు అందించాం. ‘మా’ భవనం తర్వాతి సంగతి… ముందు మనుషులు బతకాలి కదా అనుకొని అలా చేశాం’’ అని నరేశ్‌ చెప్పారు. ‘‘మా’ భవనం నేను కడుతున్నా.. కావాల్సిన స్థలం చూశా అని విష్ణు ఇటీవల చెప్పాడు. వెంటనే బాలకృష్ణ.. విష్ణుకు ఫోన్‌ చేసి మాట్లాడి నేనున్నా అని అన్నారు. సంతోషం అనిపించింది. ఇప్పుడు చూస్తే మిగిలినవారెవరూ భవనం గురించి మాట్లాడటం లేదు’ అని నరేశ్‌ అన్నారు.

Related posts