కరోనా కట్టడిపై చిన్న పిల్లలు పెద్ద పాఠం నేర్పించారని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో వెల్లడించారు. మోదీ తన ట్విట్టర్ ఖాతాలో లో ఓ ఆసక్తికరమైన వీడియో పోస్టు చేశారు. అనంతరం దానిపై వ్యాఖ్యానిస్తూ కరోనాను ఎలా కట్టడి చేయొచ్చో ఈ వీడియోలో చిన్న పిల్లలు నేర్పించారని అభినందించారు. కరోనాను పారదోలేందుకు భౌతిక దూరం పాటించడాన్ని మించిన ఆయుధం లేదని చిన్నారులు చాటి చెప్పారని కొనియాడారు.
మోదీ ట్వీట్ చేసిన ఆ 60 సెకన్ల వీడియోలో కొందరు చిన్నపిల్లలు వరుసగా ఇటుక రాళ్లను నిలబెట్టి వాటి ద్వారా కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుందో దృశ్యరూపంలో వివరించడం చూడొచ్చు. వరుసగా నిలబెట్టిన ఇటుకల్లో ఆ చివరన ఉన్న రాయిని కూలదోస్తే అక్కడి నుంచి ఈ చివరన ఉన్న రాయి వరకు పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఆ ఇటుకలే మనుషులు అనుకుంటే, దూరం పాటించకపోవడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా ఎలా వ్యాపిస్తోందో ఓ చిన్నారి తన తోటి పిల్లలకు వివరిస్తాడు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇదే కీలక అంశమని పేర్కొన్నారు.