telugu navyamedia
సినిమా వార్తలు

“గ్యాంగ్ లీడర్”పై మొదలైన వివాదం

Gang-Leader

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం “జెర్సీ” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో కూడా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో చేయనున్నాడు. కథ ప్రకారం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం మేఘా ఆకాష్, సాయి పల్లవి, ప్రియాంక ఆరుళ్ వంటి హీరోయిన్లను ఎంపిక చేసుకున్నారని సమాచారం. నాని పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను “గ్యాంగ్ లీడర్ గా ప్రకటిస్తూ, దానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. గతంలో చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో “గ్యాంగ్ లీడర్” కూడా ఒకటి. ఈ చిత్రం భారీ హిట్ తో చిరంజీవిని మరో స్థాయికి తీసుకెళ్లింది. అందుకే ఈ చిత్రం టైటిల్ ను వాడుకోవాలనే ధైర్యం చేయలేదు మెగా హీరోలు.

తాజాగా ఈ టైటిల్ పై వివాదం మొదలైంది. తమ టైటిల్ ని చట్ట విరుద్దంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మాణిక్యం మూవీస్ వారు ప్రెస్ మీట్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ డూపర్ హిట్ “గ్యాంగ్‌లీడర్” టైటిల్‌ను ఛాంబర్ లో 6 నెలల క్రితమే రిజిస్టర్ చేయించాము. నేను చిరంజీవిగారి వీరాభిమానిని. ఆ టైటిల్ అనుకున్న తర్వాతనే కథ రెడీ చేశాం. ఈలోపు చట్ట విరుద్దంగా టైటిల్‌ను కాజేసే ప్రయత్నం చేసారు. ఈ విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ పెద్దల ముందుకు తీసుకొచ్చాము. ఆరు నురయినా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌తో సినిమా నిర్మిస్తామని హీరో, నిర్మాత మోహన్ కృష్ణ అన్నారు.

మోహన్ కృష్ణ మాట్లాడుతూ ‘‘మాణిక్యం మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌ను రిజిస్టర్ చేయించాం. ఉగాది నుండి గోదావరి జిల్లాలలో 40 రోజుల పాటు షూటింగు ప్లాన్ చేశాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిరంజీవిగారి పుట్టిన రోజు కానుకగా ఆగస్ట్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము. చిరంజీవిగారు చేసిన సినిమా టైటిల్‌ను మా సినిమా టైటిల్‌గా ప్రకటించగానే మంచి స్పందన వచ్చింది. టైటిల్ హుందాతనానికి ఎక్కడా భంగం కలిగించకుండా చిత్రం నిర్మిస్తాము. దేశానికి వెన్నెముక అయిన రైతు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ చిత్ర కథనం ఉంటుంది. మెగా ఫ్యామిలీ అడిగితే సంతోషంగా ఈ టైటిల్ ఇస్తాను. మరొకరికి ఇచ్చే సమస్యే లేదు… టైటిల్ పూర్తి హక్కులు మాణిక్యం మూవీస్‌ వే…’’ అన్నారు. మరి ఈ విషయం గురించి నాని ఏమంటాడో చూడాలి.

Related posts