telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కొత్తశకం లిఖించింది-బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నాయకుల, కార్యకర్తలు, అభిమానులకు హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి నందమూరి తారక రామారావు ను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే అన్నారు

29 మార్చి 1982 చారిత్రాత్మకమైన రోజు, తెలుగుజాతికి శుభదినం. ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో కానీ..మహూర్తబలం అంతగొప్పది. అందుకే 4దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుంది.

40 ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడటం నిజంగా అద్భుతం అన్నారు. ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న టీడీపీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం.పుష్కరకాలం ఎన్టీఆర్ నాయకత్వంలో, గత 28ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సాధించిన విజయాలు అనన్యసామాన్యం.

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కొత్తశకం లిఖించింది. రాష్ట్రాభివృద్ధిలో, పేదల సంక్షేమంలో ‘‘టిడిపికి ముందు, టిడిపి తర్వాత’’ అని చూసేలా చేసింది, చరిత్రను తిరగరాసింది. ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనలో ఎన్నెన్నో అద్భుత విజయాలు, అనితర సాధ్యాలు..టిడిపి వినూత్న పథకాలు దేశానికే దిశానిర్దేశం చేశాయి. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయ్యిందని బాలకృష్ణ అన్నారు.

 

 

Related posts