telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్ లో విషాదం..మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి కన్నుమూత

జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలకు గురయ్యారు. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాయిని ఆసుపత్రి పాలు అయ్యారు. ఆయన ఆరోగ్యంగా కోలుకుని తిరిగి వస్తారనే ప్రజలు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణ వార్త ఆయన అభిమానులను, పార్టీ శ్రేణులను తీవ్ర భాదలోకి నెట్టివేసింది.

నాయిని నర్సింహా రెడ్డి 12 మే 1944 లో నల్గొండ జిల్లాలోని నేరేడుగోమ్ము గ్రామంలో రైతు దంపతులైన దేవయ్య రెడ్డి, సుభద్రమ్మలకు జన్మించారు. ఆయనకు భార్య అహల్య, కొడుకు దేవేందర్‌ రెడ్డి, కుమార్తె సమతా రెడ్డి ఉన్నారు. హైదరాబాదులో నాయకునిగా ఎదిగిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో ఆయన అత్యంత కీలకమైన హోం శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించారు. 2014 నుంచి 2018 వరకు ఆయన మంత్రివర్గంలో కొనసాగారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయినికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.

హెచ్ఎస్సి వరకు విద్యను అభ్యసించారు నాయిని. ప్రధానంగా 1969 లో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించాడు. జనతా పార్టీ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు నాయిని. మొదట వి.ఎస్.టి పరిశ్రమలలో కార్మిక సంఘం నాయకుడుగా చేశారు నాయిని. 1970 లలో హైదరాబాద్‌కు వలస వచ్చి హైదరాబాద్‌లో క్రియాశీల రాజకీయాలలో ఎదిగారు. 1969 లో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2005 నుంచి 2008 వరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో సాంకేతిక విద్య మంత్రిగా పనిచేశారు.
కేసీఆర్‌ 2001 లో పార్టీని ప్రారంభించిన తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య నాయకులుగా ఉన్నారు. 2004 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం గవర్నర్ కోటా నుండి లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎంఎల్సి) సభ్యుడుగా నియామకం అయ్యారు. వీఎస్టీ లేబర్ యూనియన్ ఇండస్ట్రీస్ సలహాదారుగా నాయిని సేవలందించారు.

Related posts