telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ కి ఎప్పటికీ… మన్మథుడే!?

Bigg-Boss

బిగ్ బాస్ 4 ముగిసింది. 15 వారాల పాటు సాగిన ఈ ఈవెంట్ ఆరంభంలో మందకొడిగా సాగినా… ఆ తర్వాత అందరినీ ఆకట్టుకుంటూ సాగింది. ఇందుకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున కూడా ఓ కారణమని చెప్పవచ్చు. మూడు, నాలుగు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించిన నాగ్ ఇక వచ్చే సీజన్స్ కి కూడా వరుసగా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడా? అవుననే వినిపిస్తోంది! ఆదివారం జరిగిన ఫినాలేలో అభిజిత్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ కూడా అందుకున్నాడు. దీంతో గత 15 వారాలుగా సాగుతున్న బిగ్ బాస్ 4కి తెరపడింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఫినాలేలో పలు అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిశితంగా గమనించిన వారికి బిగ్ బాస్ రాబోయే సీజన్స్ కి కూడా నాగార్జుననే వ్యాఖ్యాత అని ఇట్టే అర్థమైపోతుంది. చిరంజీవి స్పీచ్ లో అది నిర్ధారణ అయింది కూడా…నిజానికి బిగ్ బాస్ 4కి వ్యాఖ్యాత విషయమై పలువురు పేర్లు వినిపించాయి. మొదటి సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆరే సీజన్ 4 కి కూడా వ్యాఖ్యాత అవుతాడని బలంగా వినిపించింది. ఏమైందో ఏమో మొత్తానికి 3వ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జుననే సీజన్ 4 కి కూడా ఫిక్స్ అయ్యాడు. వరుస సీజన్స్ కి వ్యాఖ్యాత కావడం వల్లో ఏమో కానీ ఆరంభంలో బిగ్ బాస్ సీజన్ 4పై నెగెటీవ్ కామెంట్స్ వినిపించాయి. నిజానికి ఒకరికే వ్యాఖ్యాతగా ఉండటం వల్ల ఛానెల్ కే కాదు వ్యక్తిగతంగానూ పలు లాభాలు ఉంటాయంటారు. దానికి ఉదాహరణ సల్మాన్ ఖాన్. సోనీ నెట్ వర్క్ లో ప్రసారం అవుతూ వస్తున్న హిందీ
బిగ్ బాస్ కి వరసగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్న సల్మాన్ దాని స్థాయిని పెంచుతూ రావటమే కాదు ఏకంగా కోట్లకు కోట్లు పారితోషికంగా కొట్టేస్తున్నాడు. ఇప్పడు నాగ్ కి కూడా ఈ ప్రోగ్రామ్ బాగా కలసి వచ్చింది. సీజన్ 3 కంటే సీజన్ 4కి రెట్టింపు పారితోషికం లభించటమే కాదు అంతకు మించి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చాయి. ఫిల్మ్ కెరీర్ అంత ఆశాజనకంగా లేకపోయినా వ్యాఖ్యాతగా కింగ్  అనిపించుకున్నాడు నాగ్. మరి ఇకపై ప్రతి ఏటా ఇదే ఊపును కొనసాగిస్తాడేమో చూడాలి.

Related posts