telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ను నమ్మి వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబం సర్వనాశనమైనది: కన్నా లక్ష్మీనారాయణ

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రేపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు వస్తున్నారు. గతేడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నాయకుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేయనున్నారు.

జగన్ పర్యటనపై సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు.

జగన్ ను నమ్మి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఎంతో మంది సర్వనాశనమయ్యారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీకి చెందిన నలుగురు వైసీపీ కౌన్సిలర్లు నేడు టీడీపీలో చేరారు.

జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు కేవలం ఒక రోజు ముందు వైసీపీ చెందిన కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

“జగన్ ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టుల కారణంగానే నాగమల్లేశ్వరరావు ఎన్నికల బెట్టింగ్‌లో ఏకంగా రూ.10 కోట్లు నష్టపోయారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్ర అవమానాలు ఎదురవడంతో, తట్టుకోలేక ఆయన 2024 జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు.

అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇప్పుడు జగన్ రావడం సిగ్గుచేటు” అని కన్నా మండిపడ్డారు.

జగన్ అరాచకాలను ప్రజలు భరించలేకపోయారని, అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని కన్నా గుర్తుచేశారు. “ఇలాంటి అరాచక శక్తులను పరామర్శించడానికి వస్తే, ఈసారి ఆ పార్టీకి 11 సీట్లు కూడా దక్కవు” అని ఆయన హెచ్చరించారు.

Related posts