telugu navyamedia
క్రీడలు వార్తలు

ఎక్కడైనా .. మెరుగైన ప్రదర్శనే నా లక్ష్యం.. : ఇషాంత్ శర్మ

my best performance is my goal said ishanth

డేనైట్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత పేసర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌కు పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌ కకావికలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 106 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. 2007లో పాకిస్థాన్‌పై అరంగేట్ర టెస్టులోనే ఇషాంత్‌ ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా ఇన్నాళ్లకు మళ్లీ ఆ ఘనత సాధించాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇషాంత్‌.. ఎక్కడ ఆడినా ఉత్తమ ప్రదర్శన చేయాలనేదే తన లక్ష్యమని చెప్పాడు. నేను జీవితంలో ఒక దశకు చేరుకున్నా. ఏ ఫార్మాట్‌లో ఆడుతున్నాననే విషయం గురించి ఆందోళన చెందడం మానేశా. నాకిప్పుడు 31 ఏళ్లు. ఎక్కడ ఆడుతున్నాననే విషయాన్ని పట్టించుకుంటే ఉత్తమ ప్రదర్శన చేయలేను. నాకు ఆడాలని మాత్రమే ఉంది, అది రంజీ ట్రోఫీ అయినా, భారత జట్టుకైనా. ఆటను ఆస్వాదిస్తే మన ప్రదర్శన బాగుంటుంది. చిన్న విషయాలను పట్టించుకుంటే ఎప్పటికీ మెరుగవ్వలేమని పేర్కొన్నాడు.

మా జట్టులో బలమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉందని ఇషాంత్ అన్నారు. అది మా ప్రదర్శనలను మెరుగుపరుస్తుంది. జట్టులో మన స్థానం సుస్థిరమైనప్పుడు, సహచరుల నుంచి సవాళ్లు ఎదురుకానప్పుడు.. మంచి ప్రదర్శన చేయలేము. అలాంటప్పుడు రిజర్వ్‌ బెంచ్‌లోనూ ఉండటం కష్టం. నేనిప్పుడు నా ఆటను ఆస్వాదిస్తున్నా. ఇదివరకు నా ప్రదర్శనల పట్ల చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. అప్పుడు అనేక విషయాలు నా మెదడును తొలిచేవి. ఇప్పుడు అంతలా ఆలోచించట్లేదు. వికెట్లు ఎలా తీయాలనేదానిపైనే ఇప్పుడు నా ధ్యాసంతా నెలకొందని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.

Related posts