ముస్లిం మేధావుల ఫోరమ్ అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు బహుమతిగా ఇచ్చేయడం మేలని సూచించింది. ఒకవేళ కోర్టు తీర్పు మనకి అనుకూలంగా వచ్చినా సరే, దానిని ఓ బహుమతిగా ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ స్థలం దక్కినా మనం మసీదును నిర్మించగలమా? అది అసంభవం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో ఇలా మసీదును పునర్నిర్మించడం ఓ కలే అవుతుంది. ఆ భూమిని వాళ్లకిచ్చేసి ప్రతిగా ప్రార్థనా స్థలాల సవరణ చట్టాన్ని బలోపేతం చేయమని అడుగుదాం. దానిపై ఖచ్చితమైన హామీని తీసుకుందామని ఇండియన్ ముస్లింస్ ఫర్ పీస్ అనే ఆ ఫోరమ్ సూచించింది.
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా సహా పలువురు విద్యావేత్తలు ఇందులో సభ్యులు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు తుది దశకు చేరుకుంటున్న దశలో ఓ ముస్లిం గ్రూప్ నుంచి ఈ రకమైన ప్రతిపాదన రావడం విశేషం. అయితే ఈ గ్రూపు ప్రస్తుతం కోర్టు వాదనల్లో కక్షిదారు కాదు.