telugu navyamedia
రాజకీయ వార్తలు

ముషారఫ్ కు మరణశిక్షను విధించిన ప్రత్యేక కోర్టు!

Musharraf pakistan

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు మరణ శిక్షను విధించింది. దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన కోర్టు మరణదండనే తగిన శిక్ష అని తేల్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో ముషారఫ్ అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. 2013లో ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదైంది. 2014లో ఈ కేసుకు సంబంధించిన స్పెషల్ కోర్టుకు అన్ని ఆధారాలను ప్రాసిక్యూషన్ అందించింది.2016లో ముషారఫ్ పాకిస్థాన్ ను వదిలి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ఆయనకు కోర్టు పలుమార్లు సమన్లను జారీ చేసింది. అయినా ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అనంతరం పరారీలో ఉన్న వ్యక్తిగా ముషారఫ్ ను పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని ఆదేశించింది.

ముషారఫ్ కేసును పెషావర్ లో ప్రత్యేక కోర్టు విచారించింది. కేసును త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ ధర్మాసనానికి పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వం వహించారు. దీంతో, ఈ ప్రత్యేక కోర్టుకు హైకోర్టు స్థాయి ఉంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో ముషారఫ్ అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ విషయమై ఇటీవలే ముషారఫ్ స్పందిస్తూ తనపై ఉన్న అభియోగాలన్నీ నిరాధారమైనవని చెప్పారు. తన లాయర్ వాదనను కూడా కోర్టు వినడం లేదని విమర్శించారు.

Related posts