తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 25 న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఈ ఎన్నికలపై ఫేస్ బుక్ లో స్పందించారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఆధిపత్యం చెలాయిస్తుందని పలువురు అంటున్నారని, చూస్తుంటే ఈ క్రెడిట్ ను కూడా మంత్రి కేటీఆర్ ఖాతాలోనే వేస్తారనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో విపక్షాలు సైతం కేటీఆర్ పట్టాభిషేకమే ఇక తరువాయి అంటున్నాయని, ఇది టీఆర్ఎస్ హైకమాండ్ కు లాభించే అంశమని తెలిపారు. విపక్ష నేతలే ఇలా చెబుతుంటే ప్రజల్లోకి కేటీఆర్ పట్టాభిషేకం విషయం బాగా చొచ్చుకుని పోతోందని, తద్వారా జనాల్లో కేటీఆర్ ఇమేజ్ పెరుగుతుందని వివరించారు. ఏదేమైనా టీఆర్ఎస్ భావి సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని ఫేస్ బుక్ లో వెల్లడించారు.