telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : ప్లే ఆఫ్ లో స్థానం సంపాదించిన .. ముంబై..

mumbai won on hyderabad ipl 2019 match

ఐపీఎల్‌-12 ప్లేఆఫ్స్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు అడుగుపెట్టింది. సూపర్‌ ఓవర్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. డికాక్‌ (69 నాటౌట్‌; 58 బంతుల్లో 6×4, 2×6) రాణించడంతో మొదట ముంబయి 5 వికెట్లకు 162 పరుగులు సాధించింది. ఛేదనలో మనీష్‌ పాండే (71 నాటౌట్‌; 47 బంతుల్లో 8×4, 2×6), మహ్మద్‌ నబి (31; 20 బంతుల్లో 2×4, 2×6) పోరాటంతో సన్‌రైజర్స్‌ కూడా 6 వికెట్లకు సరిగ్గా 162 పరుగులు చేసింది. మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ తప్పలేదు. సూపర్‌ ఓవర్లో (బుమ్రా) మొదట సన్‌రైజర్స్‌ ఎనిమిది పరుగులే చేసింది. రెండు వికెట్లు కోల్పోవడంతో నాలుగు బంతులకే ఆ జట్టు ఆట ముగిసింది. ఛేదనలో రషీద్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్య తొలి బంతికే సిక్స్‌ కొట్టడంతో ముంబయి విజయం ఖాయమైపోయింది.

సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ సాహా (25; 15 బంతుల్లో 5×4) బ్యాట్‌ ఝళిపించడంతో ధీటుగా ఛేదన ఆరంభించింది. 3.5 ఓవర్లలోనే స్కోరు 40. ఐతే బుమ్రా బౌలింగ్‌లో నాలుగో ఓవర్‌ ఆఖరి బంతికి సాహా ఔటయ్యాడు. మనీష్‌ పాండే వస్తూనే బాదుడు మొదలెట్టాడు. మలింగ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌ బాదేశాడు. ఐతే పాండే చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించినా మరో వైపు నుంచి అతడికి మద్దతు కరవైంది. సన్‌రైజర్స్‌ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. గప్తిల్‌ (15), విలియమ్సన్‌ (3), విజయ్‌ శంకర్‌ (12), అభిషేక్‌ శర్మ (2) త్వరగా ఔట్‌ కాగా.. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. 15 ఓవర్లలో స్కోరు 106/5. కృనాల్‌ పాండ్య 4 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివరి ఐదు ఓవర్లలో గెలవాలంటే.. సన్‌రైజర్స్‌ 57 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఐతే నబితో కలిసి మనీష్‌ పాండే పోరాడాడు. నబి, పాండే బ్యాట్‌ ఝుళిపించడంతో సన్‌రైజర్స్‌ 19 ఓవర్లకు 146/5తో నిలిచింది. అయినా చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సివుండడంతో సన్‌రైజర్స్‌కు కష్టమే అనిపించింది. పైగా హార్దిక్‌ తొలి రెండు బంతుల్లో రెండే పరుగులొచ్చాయి. మూడో బంతికి నబి సిక్స్‌ కొట్టి ఆశలు రేపాడు. కానీ తర్వాతి బంతికే ఔటయ్యాడు. చివరి రెండు బంతుల్లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి పాండే రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి అతడు లాంగాన్‌లో సిక్స్‌ బాదడంతో స్కోర్లు సమమయ్యాయి. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

ముంబయి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ డికాక్‌ టాప్‌ స్కోరర్‌. కానీ సాధికారికంగా, ధాటిగా ఆడలేకపోయాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ (24; 18 బంతుల్లో 5×4) వేగంగానే ఆరంభించాడు. తొలి రెండు ఓవర్లలోనే ఐదు ఫోర్లు బాదాడు. ఐతే మరోవైపు డికాక్‌ బ్యాట్‌ ఝుళిపించలేకపోవడంతో స్కోరు బోర్డు జోరందుకోలేదు. ఐదు ఓవర్లకు స్కోరు 36/0. ఆ తర్వాతి ఓవర్లోనే రోహిత్‌ను ఖలీల్‌ వెనక్కి పంపాడు. రోహిత్‌ స్థానంలో వచ్చిన సూర్యకుమార్‌ కూడా ధాటిగానే ఆడినా.. డికాక్‌ ఇబ్బంది మాత్రం కొనసాగింది. పది ఓవర్లకు స్కోరు 76/1 కాగా.. డికాక్‌ 28 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్‌ (23; 17 బంతుల్లో 3×4, 1×6), లూయిస్‌ (1)లను ఖలీల్‌, నబి ఒక్క పరుగు తేడాతో వెనక్కి పంపారు. హార్దిక్‌ పాండ్య (18; 10 బంతుల్లో 1×4, 1×6) దూకుడు ప్రదర్శించినా అది కాసేపే. 16వ ఓవర్లో భువనేశ్వర్‌ బౌలింగ్‌లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 119. ఐతే డికాక్‌ కాస్త బ్యాట్‌ ఝుళిపించడం, పొలార్డ్‌ (10), కృనాల్‌ (9 నాటౌట్‌) చెరో సిక్స్‌ బాదడంతో ఆఖరి నాలుగు ఓవర్లలో ముంబయి 42 పరుగులు రాబట్టింది.

mumbai won on hyderabad ipl 2019 matchనేడు మ్యాచ్ : పంజాబ్ vs కలకత్తా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

Related posts