పుల్వామా ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్న సంగతి తెలిసిందే. సైనికుల కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిని ముఖేష్ అంబానీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని తీవ్రంగా నిరసిస్తూ పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్)నుంచి తప్పుకోవాలని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఐఎంజీ – రిలయన్స్ నిర్ణయించింది.
ఇప్పటి వరకూ పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించదని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. తక్షణం తమ నిర్ణయం అమలులోకి వస్తుందనీ ఇదే విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా వెల్లడించామని అన్నారు. ఉగ్రదాడులకు పాల్పడే పాకిస్థాన్ వంటి దేశాలతో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది.