telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రైతుల విషయంలో ధోనిని ఎందుకు లాగుతున్నారు…?

Ms dhoni cricketer

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో రైతులు సాగిస్తున్న అవిశ్రాంత పోరాటానికి అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ సెలెబ్రిటీలు ట్వీట్లు చేయడంపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘రైతుల సమస్య పరిష్కరించడానికి చర్చలు జరుపుతున్నాము. ఈ విషయంలో దేశమంతా రైతులకు మద్దతు పలుకుతున్నది. భారత్ అంతా ఒక్కటిగా ఉన్నది’అని పేర్కొంది. దీనికి కొనసాగింపుగా భారత సినీ ప్రముఖులు, క్రికెటర్లు, సెలెబ్రిటీలు కూడా #IndiaTogether #IndiaAgainstPropaganda వంటి హ్యాష్ ట్యాగ్‌లతో కేంద్ర ప్రభుత్వానికి మద్దుతుగా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, రోహిత్ శర్మ, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, శిఖర్ ధావన్‌లు కూడా భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఇంటర్నేషనల్ సెలెబ్రిటీలకు సూచిస్తూ ట్వీట్లు చేశారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు.

మాములుగానే సోషల్ మీడియాకు దూరంగా ఉండే మహీ.. రైతు ఉద్యమంపై జరుగుతున్న ట్వీట్ వార్‌ను కూడా పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ధోనీ పేరు ట్విటర్‌లో మారుమోగుతుంది. అయితే ధోనీ నిశబ్ధంగా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలోనే అత్యంత చర్చనీయాంశమైన ఈ ఘటనపై ధోనీ నోరు విప్పకపోవడాన్ని ఓ వర్గం విమర్శిస్తుంటే.. మరో వర్గం అతన్ని కొనియాడుతుంది. కొంత మంది మాత్రం ధోనీ ట్రెండింగ్‌లో ఉండటానికి కారణం అక్కర్లేదని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దాంతో ట్విటర్ వేదికగా #Dhoni ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ‘తీవ్ర చర్చనీయాంశమైన రైతుల దీక్షపై ధోనీ అభిప్రాయం కోసం సచిన్, కోహ్లీతో సహా ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు. కానీ అతను మాత్రం ఇవేవి పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతున్నాడు’అని ఓ యూజర్ సెటైరిక్‌గా కామెంట్ చేశాడు. ధోనీ ట్రెండింగ్‌లో ఉండాలంటే కారణం అవసరంలేదని మరొకరు ట్వీట్ చేశారు. ‘ధోనీ స్పందించలేదంటే అతనికి దేశంపై ఉన్న ప్రేమతోనే అలా నిశబ్ధంగా ఉన్నాడని అర్థం’అని మరొకరు కామెంట్ చేశారు.

Related posts