వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య ఆదివారం నాడు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
తనకు హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తాను ఏ భూవివాదంలో జోక్యం చేసుకోలేదని చెప్పాడు. రాజకీయంగా తనను అణగదొక్కే కుట్ర జరిగిందని తెలిపాడు. చట్టప్రకారం ముందుకెళ్తానని పేర్కొన్నాడు. అటు లొంగిపోయిన బజారయ్యను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నాను.
శనివారం నాడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య కు గురైయ్యాడు. ఈ హత్య కారణంగా జి.కొత్తపల్లిలో పోలీసుల రెండు వారాల పాటు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో 8 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులు మోహరించారు.
ఈ కేసులో ఏ1 గా బజారయ్య ఉన్నాడు. ఇప్పటికే ఈ హత్యను తామే చేశామంటూ సురేష్, మోహన్, హేమంత్లు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. నిందితులు ముగ్గురూ ఎంపీటీసీ సభ్యుడు బజారియా వర్గీయులు కావడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. .
కాగా..గంజి ప్రసాద్ గతంలో టీడీపీ లో ఉండేవాడు. 2019 ఎన్నికల సమయంలో ఆయన టీడీపీని వదిలి వైసీపీలో చేరాడు. టీడీపీలో ఉన్న సమయంలో ప్రస్తుత హోం మంత్రి తెనేటి వనిత అనుచరుడిగా ఉన్నాడు. తానేటి వనిత గతంలో గోపాలపురం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె వైసీపీలో చేరారు. కానీ గంజి ప్రసాద్ టీడీపీలోనే కొనసాగారు. గత ఎన్నికల సమయంలో ప్రసాద్ వైసీపీలో చేరారు.
గంజి ప్రసాద్ వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో బజారయ్యకు, గంజి ప్రసాద్ కు మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. శనివారం నాడు జి.కొత్తపల్లికి సమీపంలోనే గంజి ప్రసాద్ ను ప్రత్యర్ధులు బైక్ పై వచ్చి హత్య చేశారు.
ఈ విషయం తెలిసి మృతుడు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కూడా గ్రామస్తులు మూకుమ్ముడిగా దాడి చేశారు.
గంజి ప్రసాద్ హత్య కేసులో ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య హస్తం ఉందని పోలీసులకు కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం తాను లొంగిపోతానని బజారయ్య పోలీసులకు సమాచారం పంపాడు. ఈ సమాచారం ప్రకారంగానే బజరాయ్య పోలీసులకు లొంగిపోయారు.