telugu navyamedia
తెలంగాణ వార్తలు

బంజారాహిల్స్‌ స్థ‌ల వివాదంతో నాకు సంబంధం లేద..

బంజారాహిల్స్ స్థల వివాదంలో తనకు ఏ సంబంధం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ఏపీ జెమ్స్‌ భూ కబ్జా కేసుపై ఆయన స్పందిస్తూ.. ఈ వివాదం బయటకు వచ్చినపుడు తాను లక్షద్వీప్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు

బుధ‌వారం ఈమేరకు టీజీ వెంకటేష్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.టీజీ అనే పేరు ఉన్నంత మాత్రాన నన్ను ఈ వివాదంలోకి లాగడం సరికాదు. ఆదోని ప్రాంతంలో మా వంశీయులు ఎందరో టీజీ పేరుతో కొనసాగుతున్నారు. 

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కు సంబంధించిన స్థల వివాదం వ్యవహారంలో రెండవ రోజు ఎంపీ టిజి వెంకటేష్ పేరును బంజారాహిల్స్ పోలీసులు చేర్చారు.

ఏ-5గా టీజీ వెంకటేష్, ఏ-1గా టీజీ విశ్వప్రసాద్ ను పేర్కొన్నారు. ఈ కేసులో 80 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు 63 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారు.

అరెస్టు చేసిన 63 మందికి పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో బంజారాహిల్స్ లో విలువైన స్థలం విషయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ పై కేసు నమోదైంది.

బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..

రోడ్ నెంబర్ టెన్ లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కుకు 2005లో అప్పటి ప్రభుత్వం దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టగా ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మరో అచ ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది.

అయితే ఈ జాగా తమదేనంటూ కొందరు టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత పీజీ విశ్వప్రసాద్ కొద్ది రోజుల కిందట డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారు. దీంతో ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు ఆదివారం ఉదయం దాదాపు 10 వాహనాల్లో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకుని కాపలాదారులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిని గమనించిన కొందరు వాహనాల్లో పరారయ్యారు.

63 మందిని అరెస్ట్ చేసి ఆయుధాలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారందరిని భద్రత మధ్య కోర్టుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఎంపీ టీజీ వెంకటేష్, విశ్వ ప్రసాద్, వీవీఎస్ శర్మ తదితర 15 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.

 

Related posts