ఏపీ సీఎం జగన్ పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్హలు గుప్పించారు. నందిగామ మండలం కంచికచర్లలో గాంధీ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగానికి అతీతులం అన్నట్టుగా, నిరంకుశంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తే కనుక మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి పడిన ఓట్ల కంటే వచ్చే దరఖాస్తుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని విమర్శించారు.
సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే వాటిని సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలమైందని అన్నారు. సీఎం జగన్ కు బదులుగా రాష్ట్రంలో సమస్యలను టార్గెట్ చేయాలని టీడీపీ నాయకులకు సూచించారు. దేశంలో కుల, మత వివక్షకు తావులేని సమాజం కోసం గాంధీ మహాత్ముడు కలలు కన్నారని అన్నారు. అలాంటి దేశంలో ప్రాంతీయ పార్టీలు తమ స్వార్థం కోసం కులతత్వాన్ని రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు.