telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్..పోటీ నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో గాంధీలు చొరవ చూపకపోవడంతో పోటీ అనివార్యం కానుంది. ఎంపీ శశిథరూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పోటీలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ విషయమై శశిథరూర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. 

మరోవైపు ఆయన ఓ మలయాళం దినపత్రిక మాతృభూమిలో రాసిన వ్యాసంలో స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. అదే విదంగా సీడబ్ల్యుసీ లోని 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

పార్టీకి నాయకత్వం వహించే ఈ కీలక పదవులను ఎవరు చేపట్టాలో నిర్ణయించే అవకాశాన్ని పార్టీ సభ్యులకు కల్పించాలన్నారు. ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులు వీరిని ఎన్నుకోవాలన్నారు. అలా చేయడం వల్ల పార్టీకి నాయకత్వం వహించేందుకు రాబోతున్న నేతలకు విశ్వసనీయమైన తీర్పును ఇవ్వడానికి వీలయ్యేదన్నారు. నూతన అధ్యక్షుడిని ఎన్నికోవడం కాంగ్రెస్ పునర్వైభవానికి నాంది అవుతుందని, ఇది పార్టీకి చాలా అవసరమని చెప్పారు.

బ్రిటీష్ కన్జర్వేటివ్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. థెరిసా మే స్థానంలో డజనుకు పైగా మంది పోటీ పడగా బోరిస్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి దృష్ట్యాంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో అమలు చేయడం ద్వారా పార్టీ వైపునకు ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన ఆ ఆర్టికల్ లో రాశారు.

2020లో పార్టీలో సంస్కరణలకు డిమాండ్ చేసిన జీ23 నేతల్లో శశి థరూర్ ఒకరు. అలా కాకుండా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి ఎవరైనా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా మారితే.. జీ23 గ్రూపు ప్రతినిధిగా శశి థరూర్ అతనిపై పోటీ చేయవచ్చు. హైకమాండ్ ప్రతినిధి గెలుపొందడం ఖాయమైనా.. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై పార్టీలోనే చర్చించేందుకు పోటీ తప్పదని వర్గం భావిస్తోంది.

థరూర్ అంగీకరించకపోతే మనీష్ తివారీ పోటీ చేయాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ పోటీ చేసినా తివారీ రంగంలోకి దిగవచ్చు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనప్పటికీ గ్రూపు సభ్యుల్లో మాత్రం చర్చ జోరుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే, వచ్చే నెల 22న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. సెప్టెంబర్‌ 24 నుంచి 30 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అక్టోబర్‌ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 8. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే అక్టోబర్‌ 17న ఎన్నిక నిర్వహిస్తారు. అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు విజేత పేరును ప్రకటిస్తారు.

Related posts