సీఎం జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఆరు పేజీలతో కూడిన లేఖను సీఎంకు పంపించారు. ఈ మధ్య విజయసాయిరెడ్డి నుంచి నోటీసు అందిందని, ఆయన లేఖకు స్పందిస్తూ రిప్లై ఇస్తున్నట్లు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. సీ ఓటర్ సర్వేలో 4వ స్థానం వచ్చినందుకు జగన్‌కు అభినందనలు తెలిపారు. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే తనకు లేఖ పంపించడానికి విజయసాయిరెడ్డి ఎవరంటూ నిలదీశారు. రిజిస్టరయిన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ లెటర్ హెడ్‌తో నోటీసు అందిందని తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని.. పలు సందర్భాల్లో ఈసీ మన పార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును ఏ సందర్భంలోనూ వాడుకునే అవకాశం లేదని ఈసీ తేల్చి చెప్పిందని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఓ సాంగ్ విడుదల చేశారు. సాంగ్‌ను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. దీంతో ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నట్లు తెలుస్తోంది.