telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎన్టీఆర్” సినిమా పై ప్రముఖుల కామెంట్స్

NTR-Biopic

దివంగత నందమూరి తారకరామారావు జీవితచరిత్ర ఆధారంగా “ఎన్టీఆర్ బయోపిక్”ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. నిన్న ప్రీమియర్ షో చూసిన నందమూరి అభిమానులు సినిమా బాగుందంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈరోజు విడుదలైన “ఎన్టీఆర్ : కథానాయకుడు” చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు వీక్షించారు. ఈ సందర్భంగా “కథానాయకుడు”ను ఆశీర్వదించిన ప్రేక్షకదేవుళ్లందరికీ హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని, ఈ చిత్రం అభిమానులకు సంబంధించింది కాదని, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ చెందిన సినిమా అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

ఇక దర్శకుడు క్రిష్ మీడియాతో మాట్లాడుతూ “రామారావు గారి గురించి చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉంది. రామారావు గారి గురించిన కథ అందరికీ తెలుసు.. అందరికీ తెలియదు. ఒక గొప్ప కథ, అందమైన స్క్రీన్ ప్లే వచ్చింది. రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి వస్తున్న కాల్స్ చూస్తుంటే రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్. ఆయన ప్రభ ఏమాత్రం తగ్గకుండా, ఆయన శోభను ప్రెజెంట్ చేసినందుకు కొంచం గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఏఎంబీ స్క్రీన్-1లో ఈ సినిమా నేను చూశాను. కొన్ని స్క్రీన్స్ లో ఎఫెక్ట్స్ బాగా ఉండవు కానీ, మేము ఏదైతే ఎంత గొప్పగా తీశామో… అంతే గొప్పగా ఈ స్క్రీన్ లో ఉంది. ఇంకోసారి ఆ స్క్రీన్ లోనే సినిమా చూడాలి. మా పని ఇంకా కొనసాగుతోంది. ” ఎన్టీఆర్” పార్ట్ 2 పూర్తయిన తర్వాత మళ్లీ మాట్లాడతానని అన్నారు.

బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నాన్నగారు తాతగారిలాగే ఉన్నారు. తాతగారు ఎప్పుడూ ప్రజాసేవ గురించి ఆలోచించేవారు… కుటుంబంతో చాలా తక్కువ సమయం గడిపారు. మా నాయనమ్మ బసవతారకంగారు నేను పుట్టకముందే పోయారు. ఆమె ఎంతో గొప్ప వ్యక్తి. తాతగారికి ఫిల్మ్ కెరీర్ లోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఆమె చాలా సపోర్టు చేశారు. ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు. టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం హిట్ అవుతుందని మంచి వస్తుందనే నమ్మకం నాకుంది. థియేటర్లో ఈ సినిమా చూస్తున్నంతసేపు సినిమాలా లేకుండా నిజంగా జరుగుతున్నట్టుగా అన్పించింది. నాన్నగారి ప్రొడక్షన్ లో మొదటి సినిమా ఇది” అంటూ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ మనవరాలు, హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని మీడియాతో మాట్లాడుతూ తమ తాతయ్య ఎన్టీఆర్ గురించి తెలియని వాస్తవాలను “కథానాయకుడు” ద్వారా తెలుసుకున్నానని, ఈ సినిమా బాగా చిత్రీకరించారని, నాన్నగారి పాత్రలో కల్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటించారని, ఈ సినిమాలో నటీనటులందరూ బాగా చేశారు. క్రిష్ గారి దర్శకత్వం అద్భుతమని, ఈ చిత్రం రెండో భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.

బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను వీక్షించిన ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగమైన “కథానాయకుడు” చరిత్ర సృష్టిస్తుందని, మరోసారి అందరి కళ్ళముందూ ఎన్టీఆర్ సృష్టించిన చరిత్రను ఎన్టీఆర్ రూపంలో బాలయ్య మరో చరిత్ర సృష్టించారని, ఆ మహాపురుషుడి చరిత్రను అద్భుతంగా ఆవిష్కరించారని, ఆ మహానుభావుడి ఆర్ద్రతతోనే నా కళ్లు చెమ్మగిల్లాయని, ఎన్టీఆర్ ని చూడని వాళ్లకు ఆయన్ని చూపించిన ఘనత బాలయ్యదేనని, బసవతారకం పాత్రను అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు.

ఇక ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమా గురించి ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనీ, మహాపురుషులవుతారనీ నిరూపించిన కారణజన్ముడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆ మహానుభావుడి పాత్రను అత్యద్భుతంగా పోషించిన బాలయ్యకు హ్యాట్సాఫ్. డైరెక్టర్ క్రిష్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, విద్యాబాలన్ మొదలైన టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా నా అభినందనలు” అంటూ పోస్ట్ చేశారు రాఘవేంద్ర రావు.

Related posts