మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ సమాజానికి మోత్కుపల్లి నర్సింహులు పరిచయం అక్కర్లేని వ్యక్తి అని ప్రశంసించారు. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు.
ప్రజా జీవితంలో మోత్కుపల్లికి ఒక స్థానం ఉందని, విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా అణగారిన ప్రజల గొంతుగా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించిందని ఒకప్పటి పరిస్థితులను గుర్తు చేశారు.
తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, ఆనాడు విద్యుత్ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని, విద్యుత్ మంత్రిగా చేసిన మోత్కుపల్లికి ఆ కష్టాలు తెలుసని చెప్పారు. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారమని ఉద్యమం ప్రారంభించామని గుర్తుచేశారు. తెలంగాణ గురించి దేశ నేతలందరికీ అర్థమయ్యేలా చెప్పామన్నారు. స్వరాష్ట్రం కోసం ఒక్క మాయావతినే 13 సార్లు కలిశామని తెలిపారు. తెలంగాణ సాధనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. తనను తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదని చెప్పారు.
మోత్కుపల్లికి కరోనా వచ్చినప్పుడు వైద్యులతో మాట్లాడానన్న సీఎం.. ఆయన వైద్యానికి రూ.కోటి ఖర్చయినా పర్లేదని చెప్పానని పేర్కొన్నారు. మోత్కుపల్లితో నా స్నేహం రాజకీయాలకు అతీతమని తెలిపారు. దళితబంధుతో ఈ సంక్షేమం ఆగదని.. అన్ని వర్గాల కోసం పనులు కొనసాగుతాయన్నారు. దళితబంధు భేటీలకు మోత్కుపల్లి హాజరయ్యారన్నారు.
కొన్ని సరిహద్దు ప్రాంతాలు తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నాయని వెల్లడించారు. బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కేసీఆర్ అన్నారు. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదని.. ఏం సాధించామన్నదే ముఖ్యమన్నారు. వెనకబడిన వర్గాలను బాగుచేసుకునేందుకు యావత్ తెలంగాణ ఏకంకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
కోర్టులతో ఆటలాడితే మొట్టికాయలు తప్పవు: రేవంత్ రెడ్డి