telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

272 మంది ఎన్నికల సిబ్బంది… ఓట్లను లెక్కబెడుతూ మృతి

Voting

ఇండొనేషియాలో అధ్యక్ష పదవికి సంబంధించి ప్రాంతీయ, జాతీయ పార్లమెంటు స్థానాలకు ఏప్రిల్ 17న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 26 కోట్ల మంది ఉన్న జనాభాకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించింది అక్కడి ఎన్నికల కమిషన్. దాదాపు 19 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఇండోనేషియాలో 80 శాతం పోలింగ్ నమోదైంది. ఒక్కో ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మే 22న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో.. ఎన్నికల సిబ్బంది రేయింబవళ్లు కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో కౌంటింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో అలసటకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వందలాది సిబ్బంది ప్రాణాలను కోల్పోతున్నారు. జనరల్ ఎలక్షన్ కమిషన్(కేపీయూ) తెలిపిన వివరాల ప్రకారం శనివారం వరకు మొత్తంగా 272 మంది ఎన్నికల సిబ్బంది చనిపోగా, 1,878 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి అధికారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆరోగ్య శాఖ ఓ సర్కులర్ విడుదల చేసింది. చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే యోచనలో ఆర్థికశాఖ ఉంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల కమిషన్ తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేకపోవడం కారణంగానే ఇంతమంది చనిపోయారని ప్రతిపక్ష పార్టీకి చెందిన అహ్మద్ ముజానీ ఆరోపించారు.

Related posts