telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

వివిపాట్ లెక్కింపు ఐదుకు పెరిగింది.. ఫలితాలు అర్ధరాత్రికే.. ఆలస్యం తప్పదు..

election notifivation by 12th said ec

అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఈసారి మరికాస్త ఆలస్యం కానున్నాయి. అధికారికంగా ఫలితాలు తెలుసుకోవాలంటే గతం కంటే దాదాపు అయిదారు గంటలకు పైగా వేచిచూడక తప్పేలా లేదు. వీవీప్యాట్‌ చీటీలను కూడా లెక్కించాల్సి రావడమే దీనికి కారణం. నిజానికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) వచ్చిన తర్వాత ఫలితాలు చాలా తొందరగానే వెలువడుతున్నాయి. బ్యాలెట్‌ పత్రాల నాటి కాలంతో పోలిస్తే ఓట్ల లెక్కింపు సమయం బాగా ఆదా అవుతోంది. లెక్కింపు రోజున ఉదయం 10-11 గంటలకల్లా ఆధిక్యాలు, మధ్యాహ్నానికి తుది ఫలితాలు తెలిసిపోతున్నాయి. వీవీ ప్యాట్‌ (ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) చీటీలను కూడా లెక్కించాలన్న నిబంధన కారణంగా ఈసారి అదనపు సమయం తప్పదు.

ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండే ప్రతి శాసనసభ స్థానం నుంచి ఐదు చొప్పున వీవీప్యాట్‌లను యాదృచ్ఛిక (ర్యాండమ్‌) పద్ధతిలో ఎంపిక చేసి, వాటిలోని చీటీలను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే తుది ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. సగటున ఒక్కో వీవీప్యాట్‌లో చీటీలు లెక్కించేందుకు గంట సమయం పడుతుందని అంచనా. ఆ లెక్కన గత ఎన్నికల కంటే కనీసం ఐదారు గంటల పాటు ఫలితాలు ఆలస్యం అవుతాయి. ఈవీఎంలలో పోలైన ఓట్లన్నింటినీ లెక్కించిన తర్వాత మాత్రమే వీవీప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఇంతకుముందు సుమారుగా మధ్యాహ్నం 1-2 గంటల మధ్య ఫలితం వెల్లడైతే ఈసారి అది రాత్రి 7-8 గంటల సమయంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇది కూడా అంతా సజావుగా జరిగితేనే. ఎక్కడైనా పొరపాటున ఈవీఎంలో వచ్చిన ఓట్లకు.. వీవీప్యాట్‌ చీటీల లెక్కకు ఒక్క అభ్యర్థి విషయంలో తేడా వచ్చినా రీకౌంటింగ్‌ చేయాలి. అప్పుడు మరికొంత సమయం పడుతుంది.

ఫలితాలు, అభ్యర్థులకు ఈవీఎంలలో వచ్చిన ఓట్ల సంఖ్య, వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపులో వచ్చిన ఓట్ల సంఖ్య సరిపోలితేనే ప్రకటిస్తారు. వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు విధానం, ఈవీఎంలలో వచ్చిన ఓట్ల సంఖ్య, వీవీ ప్యాట్‌ చీటీల్లోని ఓట్ల సంఖ్యకు మధ్య తేడా వస్తే అనుసరించాల్సిన పద్ధతి తదితర అంశాలపై ఎన్నికల సంఘం ఇటీవల దిశా నిర్దేశం చేసింది. ఇలా వ్యత్యాసం వస్తే అవి సరిపోలేంతవరకూ రీకౌంటింగ్‌ నిర్వహిస్తారు. అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్‌ చీటీల్లోని సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటారు.

Related posts