మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సామాన్యులతోపాటు సినీ ప్రముఖులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉయ్యలవాడ నర్సింహారెడ్డి పాత్రలో కనిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. అయితే గత కొద్ది రోజులుగా చిత్రంకి సంబంధించి అనేక వివాదాలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే అన్నింటిని చక్కదిద్ది రేపు మూవీని రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కాగా ‘సైరా’ కోసం ప్రేక్షక లోకం అసక్తిగా ఎదురుచూస్తోంది. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా సైరా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా “సైరా”. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్‌కు, చిరంజీవికి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్” అని ట్వీట్‌లో తెలిపారు.
నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. Best of Luck!
— Mohan Babu M (@themohanbabu) 1 October 2019