telugu navyamedia
క్రీడలు వార్తలు

అశ్విన్ సెంచరీ.. సిరాజ్ ను పొగుడుతున్న ఫ్యాన్స్

టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి అభిమానుల మనస్సులు దోచుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్ ఫెర్ఫామెన్స్‌తో సత్తా చాటిన ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో‌నూ తనదైన ఆటతో అదరగొడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. స్వదేశంలో ఫస్ట్ టెస్ట్ ఆడుతున్న సిరాజ్.. తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఇక మూడో రోజు ఆటలో ఆఖరి వికెట్‌‌కు బ్యాటింగ్‌కు దిగిన ఈ హైదరాబాద్ స్టార్.. క్రీజులో నిలిచి అశ్విన్ సెంచరీ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అశ్విన్ సెంచరీ పూర్తయిన వెంటనే ఎగిరి గంతేశాడు. సహచరుడి సెంచరీ తనదే అన్నట్లుగా సిరాజ్ సెలెబ్రేట్ చేసుకోవడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని అసాధారణ పోరాటానికి అభిమానులంతా ఫిదా అయ్యారు.

శభాష్ సిరాజ్ అంటూ కొనియాడుతున్నారు. సహచరుడి ఘనతను ఆస్వాదించే గొప్ప మనసు నీదంటూ మెచ్చుకుంటున్నారు. ఇక సిరాజ్ క్రీజులోకి వచ్చే సమయానికి అశ్విన్ 80 పరుగుల వద్ద ఉన్నాడు. దాంతో అతని సెంచరీ అసాధ్యమేనని అంతా భావించారు. కానీ సిరాజ్ 15 బంతులను డిఫెన్స్ చేసి తన సహచరుడి సెంచరీకి సాయం చేశాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొనే ప్రతి బంతికి ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభించింది. అరుపులు, చప్పట్లతో చెపాక్ దద్దరల్లింది. ఇక అశ్విన్ సెంచరీ పూర్తవ్వగానే తనలోని హిట్టర్‌ను నిద్రలేపిన సిరాజ్.. రెండు భారీ సిక్సర్లు కొట్టి అందర్ని ఆశ్చర్యపరిచాడు. తనకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉందని ఇంగ్లండ్ బౌలర్లకు చెప్పకనే చెప్పాడు. ఇక సిరాజ్ సూపర్ బ్యాటింగ్‌కు కామెంటేటర్లు కూడా అవాక్కయ్యారు. సూపర్ బ్యాటింగ్ అంటూ కొనియాడారు. తాను ఏమాత్రం టెయిలెండర్ కాడని, ఫించ్ హిట్టరని కొనియాడారు. హైదరాబాద్ దమ్ బిర్యాని దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడని ప్రశంసించారు. చివరకు అశ్వినే క్లీన్ బౌల్డ్ కాగా.. సిరాజ్ అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరు ఆఖరి వికెట్‌కు 49 పరుగులు జోడించడం విశేషం.

Related posts