ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఓసాకు అంతర్జాతీయ క్రీడాకారులు మద్దతు తెలుపుతున్నారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నారు. ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని, ఎప్పుడో రూపొందించిన పాత నిబంధనలను సవరించాలని సూచిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్‌లో విజయానంతరం మీడియా సమావేశానికి హాజరుకాకపోవడం వల్ల ఒసాకాకు రిఫరీ 15,000 డాలర్ల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి చెందిన ఒసాకా టోర్నీ నుంచి వైదొలిగింది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా మీడియాతో మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. 2018 యూఎస్ ఓపెన్ నుంచి తాను మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు, అందుకే తప్పుకొంటున్నట్లు ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించాడు. ఓసాకాకు తన మద్దతు ప్రకటించాడు. క్రీడాకారులకు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని తెలిపాడు. టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి వ్యక్తిగత ఆటలలో ఇది కాస్త ఎక్కువేనని పేర్కొన్నాడు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు మీడియా సమావేశాల నుంచి సడలింపులు ఇవ్వాలని సూచించాడు.
previous post