telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉగ్రవాదంపై .. కలిసి పోరాడాలి.. మయన్మార్ పర్యటనలో మోడీ…

modi on mayanmar tour

మయన్మార్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మయన్మార్ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీతో సమావేశమైన ఆయన ఈ విషయంలో పూర్తిస్థాయిలో సహకరించాలని, సరిహద్దులోని ఉగ్రవాద మూకలకు కేంద్రాలు కానివ్వకూడదని ఉద్ఘాటించారు. మయన్మార్‌లోని రఖీనా రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక ప్రాజెక్టులను విస్తరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఓ హౌసింగ్ ప్రాజెక్టును భారత్ చేపట్టిన నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం విస్తరించాలంటే సరిహద్దుల్లో శాంతి అత్యంత కీలకమని ఈ ఇరువురు నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉగ్రవాదులను, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే విషయంలో భారత్‌కు మయన్మార్ సహకారం చాలా అవసరమని మోదీ తెలిపారు.

భారత్‌కు ఉన్న వ్యూహాత్మక పొరుగు దేశాల్లో మయన్మార్ ఒకటి. నాగాలాండ్, మణిపూర్ సహా పలు ఈశాన్య భారత రాష్ట్రాలకు మయన్మార్ 1640 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. గత ఏడాది వరకు మయన్మార్‌లోని ఈశాన్య ప్రాంతంలో 50కి పైగా ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిని లక్ష్యంగా చేసుకుని భారత్-మయన్మార్ సైనిక దళాలు ఈ ఏడాది మే 16న ఉమ్మడిగా దాడులు జరిపాయి. మణిపూర్, నాగాలాండ్ సరిహద్దుల్లో ఉన్న అనేక ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని తుదముట్టించాయి. అలాగే, మేలో జరిగిన ఆపరేషన్ సన్‌రైజ్ దాడిలో కూడా కేఎల్‌ఓ, ఎన్‌ఎస్‌సీఎన్, అస్సాం ఐక్య విమోచన ఫ్రంట్, బోరో ల్యాండ్ జాతీయ ప్రజాస్వామ్య ఫ్రంట్‌లకు చెందిన ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయని రక్షణ వర్గాలు తెలిపాయి.

Related posts