ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరుగుతుంది. రేపటితో నామినేషన్ల గడువు కూడా ముగుస్తోంది. దీనితో టీడీపీ నుంచి ఈసారి పెద్దల సభకు ఎవరు వెళ్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై చంద్రబాబు ఇంత వరకూ కసరత్తు చేయలేదు. రాత్రికి ఆశావహులతో మాట్లాడి.. ఫైనల్ చేస్తారు. ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఐదింటిలో సంఖ్యాబలం ప్రకారం ఒకటి వైసీపీకి దక్కుతుండగా, టీడీపీకి నాలుగు వస్తాయి. ఈ సారి కూడా యనమలకు చంద్రబాబు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అలాగే.. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారం అశోక్ బాబును కూడా ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మంత్రి ఆది కుటుంబంలో ఒకరికి, జమ్మలమడుగు నేతలు ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఎమ్మెల్సీ పదవి దక్కనుంది. ఇక సీనియర్ నేతలు కూడా తమకో అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. అజీజ్, వర్ల రామయ్య, జూపూడి, పంచుమర్తి అనురాధ, బుట్టా రేణుక, గాదె వెంకట రెడ్డి, సబ్బం హరి సహా మరికొందరు తమ అభిప్రాయాల్ని చంద్రబాబుకు చెప్పారు. ఈసారి అనూహ్యంగా తెరపైకి కొత్త పేర్లు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదన్న మాట కూడా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నందున.. అసంతృప్తులను బేరీజు వేసుకుంటూ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు చంద్రబాబు.